31 August, 2026 | 1:56 PM

ఆపద్బాంధవుడు

09-06-2024 02:07 AM

ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు రామోజీ అండ

సాయం చేస్తూనే మరో నలుగురిని భాగస్వామ్యం చేసేవారు 

తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ దాతృత్వం 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఆపత్కాలంలో ఆదుకోవడంలో రామోజీరావు ముందుండేవారు. ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులు, చిన్నపిల్లల వైద్యం, కరోనా సమయంలో చేయూతనివ్వండి అని పిలుపునివ్వడంతోపాటు ఆయన స్వయంగా సాయానికి పూనుకునేవారు. రామోజీరావు  పిలుపును అందుకుని దాతలు తామున్నామంటూ ముందుకొచ్చి చేతులు కలిపేవారు. దాతలు ఇచ్చిన ప్రతి రూపాయిని బాధితులకు చేర్చేవారు. నిధులను బాధితులకు ఎలా చేర్చాలి? ఎలా ఖర్చు చేయాలి? అనే అంశంపై అధికారులు, నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకునేవారు. నిర్మాణాలు పూర్తయ్యాక నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామ పంచాయతీలకు అప్పజెప్పేవారు. 

* 1976లో దివిసీమ ప్రాంతంలో వరుసగా 3 తుపాన్లు విరుచుకుపడ్డాయి. అప్పుడే  తొలిసారిగా తుపాను సహాయనిధిని ప్రారంభించగా విశేష స్పందన లభించింది. రూ.65 వేలు విరాళాల రూపంలో రాగా సీఎం సహాయ నిధికి అందించారు. 

* 1977 నవంబర్‌లో కృష్ణా జిల్లా పాలకయతిప్ప గ్రామాన్ని వరదలు ముంచేశాయి. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో 112 పక్కా ఇళ్లు కట్టించారు. ఇళ్లు కట్టగా మిగిలిన డబ్బుతో పక్కనే కృష్ణాపురం అనే గ్రామంలో మరో 22 మందికి నీడ కల్పించారు. 

* 1999లో కోస్తాలో పెనుతుపాను రాగా బాధితులకు అండగా నిలిచారు. రూ.25 లక్షలతో తుపాను సహాయనిధి ప్రారంభిం చారు. దాతల సాయంతో నిధి రూ.కోటికి చేరింది. 42 సూర్యభవనాలను తీరంలోపునరావాసకేంద్రాలుగా ఉపయోగించారు. 

* 2009 అక్టోబర్‌లో కృష్ణ, తుంగభద్ర, కుందు నదులకు భారీ వరదలు రావడంతో కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలు కకావికలమయ్యాయి. బాధితులకు అండగా తక్షణ మే రంగంలోకి దిగి 1.2 లక్షల ఆహార పొట్లాలను అందజేశారు. తన వ్యాపార గ్రూప్ సంస్థల నుంచి రూ. కోటి విరాళం ప్రకటించి, దాతలకు పిలుపునిచ్చారు. ఇలా రూ.6.05 కోట్లు సమకూరాయి. వీటితో మహబూబ్‌నగర్ జిల్లాలో చేనేత కుటుంబాలకు మగ్గాలు అందజేశారు. కర్నూల్ జిల్లాలో ఉషోదయ పేరిట ఆధునిక సౌకర్యాలతో 4 పాఠశాల భవనాలను నిర్మించి 2011 జులై 14న ప్రభుత్వానికి అప్పగించింది. బాధితులను ఆదుకునేందుకు వేల మంది వితరణశీలురు రూ.కోట్లు విలువ చేసే సామగ్రి పంపిణీ చేశారు. 

* 2014లో హుద్‌హుద్ బాధితుల కోసం రూ.3 కోట్ల సహాయనిధితో పాటు పాఠకుల విరాళాలు రూ.3 కోట్ల కలిపి విశాఖ జిల్లాలలోని తంతడి, వాడపాలెం ప్రాంతాల్లో 80 కొత్త ఇళ్ల నిర్మాణంతో పాటు దెబ్బతిన్న మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు చేయించారు.  

* కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ సాయాన్ని రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధి ఖాతాలకు బదిలీ చేశారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధించాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు రామోజీరావు ప్రత్యేకంగా లేఖలు రాశారు. 

* రామోజీ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకొన్నది. అందులో ఒకటి కృష్ణా జిల్లా పెదపారుపూడి కాగా, రెండోది రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లి గ్రామం. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి ఫౌండేషన్ ఎంతగానో కృషి చేసింది. కోట్లాది రూపాయలు ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చించింది. 

పక్కరాష్ట్రాల్లోనూ.. 

* 1999లో ఒడిశాను సూపర్ సైక్లోన్ చెల్లాచెదురు చేసింది. అప్పుడు కూడా ముందుకొచ్చి పక్కా ఇళ్లను నిర్మించారు. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో రూ.50 లక్షలతో పక్కా ఇల్లు కట్టించి ఇచ్చారు. 

* 2001లో గుజరాత్‌లో వేలాది మందిని బలిగొన్న భూకంపంలో తనవంతు సాయం అందించారు. రూ.2.2 కోట్లతో కచ్ జిల్లాలో స్వామినారాయణ్ సంస్థ సహకారంతో 104 ఇళ్లను నిర్మించి ఇచ్చారు. 

* 2004లో దేశ దక్షిణ తీర ప్రాంతంలో సునామీ ముంచెత్తినప్పుడు తీవ్రంగా నష్టపోయిన కడలూరు, నాగపట్టణం జిల్లాలలో రూ.2.5 కోట్ల వెచ్చించి రామకృష్ణ మఠం సహకారంతో మత్స్యకారులకు 164 ఇళ్లు నిర్మించి బాధితులకు  అందించారు. 

* 2018లో కేరళ వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా నిలిచేందుకు రామోజీ గ్రూప్ సంస్థల నుంచి రూ.3 కోట్లతో సహాయ నిధిని ఏర్పాటు చేశారు. మానవతావాదులు కూడా ఆదుకోవాని పిలుపు ఇవ్వగా ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ఇలా ఎంతో మంది సాధ్యమైనంత మేరకు విరాళాలు అందించగా రూ.7.77 కోట్లకు చేరింది. ఆ డబ్బుతో అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 121 కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించారు. 

రామోజీని వరించిన అవార్డులు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రామోజీరావును ఎన్నో అవార్డులు వరించాయి. జర్నలిజం ఉన్నత ప్రమాణాలను పాటించినం దుకు ఇచ్చే బీజీగోయంకా అవార్డును 2001లో అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో సేవలకుపద్మభూషణ్, పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రదా నం చేసింది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రామోజీరావు పనిచేశారు. ఆంధ్ర, శ్రీవెంకటేశ్వర, రవిశం కర్ వర్సిటీలు డాక్టరేట్లతో గౌరవించాయి. రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ రికార్డ్స్‌లో స్థానం పొందింది.

రామోజీ కథనంతోనే మండలి రద్దు!

శాసనమండలి తీరుపై అప్పట్లో సంచలన సంపాదకీయం

హైదారాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): 1980, 90 దశకాల్లో రామోజీరావు ఏం చేసినా సంచలనం అయ్యేది. నాదేండ్ల భాస్కర్‌రావు ఉదం తం తర్వాత 1985లో ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యారు. ఆ సమయంలో శాసనసభలో టీడీపీకి మెజార్టీ ఉన్నా మండలిలో కాంగ్రెస్ సభ్యులు ఎక్కువ ఉండేవారు. దీంతో అసెంబ్లీలో టీడీపీ తీసుకున్న నిర్ణయాలకు మండలిలో కాంగ్రెస్ అడ్డుకునేది.

దీంతో మండలిలో కొందరు సభ్యుల తీరుపై ఈనా డులో పెద్దలా? గద్దలా? అని రామోజీరావు సంపాదకీయం రాశారు. అది సంచలనమైంది. దీనిపై మండలి చైర్మన్ చక్రపాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. మం డలికి వచ్చి సమాధానం చెప్పాలని నోటిసులు పంపారు. రామోజీరావు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని మండలికి  వెళ్లే పనిని తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అప్పటి సీఎం ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు.