పల్లెల్లో... ‘బెల్ట్’జోరు
- ఇళ్లే అడ్డాలు.. కిరాణా దుకాణాలే మద్యం విక్రయ కేంద్రాలు...?
- అధిక ధరలకు అక్రమంగా విక్రయాలు
- బెల్ట్‌షాప్ నిర్వాహకులకు వైన్స్ యజమానుల అండ
- మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు
- అక్రమ బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు ఉక్కు పాదం మోపెనా...?
బాన్సువాడ, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లోనీ పల్లె ప్రాంతాల్లో అక్రమ బెల్ట్ షాపు(Belt Shop)ల దందా విచ్చలవిడిగా కోనసాగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు రహస్యంగా సాగిన బెల్ట్ షాపుల వ్యవహారం ఇప్పుడు బహిరంగంగానే కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో కిరాణా దుకాణాలు, ఇళ్లను అడ్డాగా చేసుకుని అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మద్యం దుకాణాల్లో లభించే ధరల కంటే అధిక ధరలకు బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారని, రాత్రి వేళల్లోనూ విక్రయాలు కొన సాగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో కూలీలు, పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నడుస్తున్నాయి.
బెల్టు షాపుల నిర్వాహకులు వైన్స్ నుండి ద్విచక్ర వాహనాలపై మద్యాన్ని తరలిస్తున్నారు. బెల్టు షాపుల్లో మద్యం అధిక ధరలకు విక్రాయిస్తున్నా కూడా బెల్ట్ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. వీరికి వైన్సు నిర్వహకులు కొండంత అండగా ఉంటున్నారు. మీ దగ్గరికి ఎవరూ రారు.. మేము చూసుకుంటాం అని భరోసానిస్తున్నారు. అందుకుగానూ ఒక్కో బీరుపై రూ.20, మద్యం బాట్పి రూ.20 నుంచి 30 వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వహకులు వినియోగదారుల నుంచి ఒక్కో సీసాపై రూ.30-50 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువేత్తుతున్నాయి
అనుమతులు లేకుండానే అమ్మకాలు?
మద్యం విక్రయాలకు ఎలాంటి అనుమతులు లేని ప్రాంతాల్లోనూ బాటిళ్లు అందుబాటులో ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, అవసరమైన సమయంలో ఎక్కడికెళ్లినా మద్యం దొరికే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘మామూళ్ల’ ఆరోపణలు..
అక్రమ బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి కొందరు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతి నెల ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అధికారులు సిబ్బంది గ్రామాల్లో నిర్వహించే బెల్టు షాపు నిర్వాహకుల నుండి మామూలు వసూలు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు దాడులు చేసే సమయంలో బెల్టు షాపు నిర్వాహకులకు సమాచారం అందిస్తున్నారని ఆరోపణలు కూడా చర్చలుగా సాగుతున్నాయి.
కుటుంబాల్లో కలహాలు.. ఆర్థిక ఇబ్బందులు
మద్యపానానికి బానిసైన కొందరు వ్యక్తుల కారణంగా కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. రోజువారీ కూలీ డబ్బులు మద్యం కోసం ఖర్చు చేయడంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని పలువురు వాపోతున్నారు.
ఫిర్యాదులు వస్తే చర్య తీసుకుంటాం
బెల్ట్ షాపులపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. బెల్ట్ షాపులు నిర్వహించకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం.
- ముకుంద రెడ్డి,
ఎక్సైజ్ సూపర్డెంట్, కామారెడ్డి






