2 September, 2026 | 2:45 AM

చీటింగ్, లూటింగ్‌లో ఆరితేరిన రేవంత్‌రెడ్డి సర్కార్

02-09-2026 | 02:08am

వేల కోట్లు ప్రజలకు బాకీ పడిన కాంగ్రెస్ ప్రభుత్వం

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్  ఉందా?

హామీల అమలుపై బీఅర్‌ఎస్ పోరు ఆగదు 

ఆర్మూర్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): సిద్ధుల గుట్ట శివయ్య సాక్షిగా ఎన్నికల  హామీలు అమలు చేస్తానని నాడు ఒట్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేడు వాటి అమలుపై నిలదీస్తే నేడు తిట్ల దండకం అందుకుంటున్నారని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన అదే సిద్ధులగుట్టపై శివయ్య సాక్షిగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420  హామీలను బొంద పెట్టిందని మండిపడ్డారు. చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్ ఖజానాకు కన్నం వేయడం, పాతగోడలకు సున్నం వేయడం తప్ప ఈ వెయ్యి రోజుల పాలనలో ఊడబోడి చిందేమిటని జీవన్ రెడ్డి నిలదీశారు.

ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వేల కోట్ల రూపాయలు  బాకీ పడిందని ఆయన ఆరోపించారు. హామీల అమలు జరిగేంతవరకు బీఅర్‌ఎస్ పోరు ఆగదన్నారు. కేసీఆర్ ప్రజలు ఆరాధించే నంది అని, రేవంత్ ప్రజలు రాళ్ళతో కొట్టే ముండ్ల పంది అని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేపట్టే పోరాటాలకు బీఆర్‌ఎస్  మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను, ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, వివిధ వర్గాలకు ఎన్నికల హామీల రూపంలోనూ, బిల్లుల రూపంలోనూ చాలా డబ్బు బాకీ పడిందన్నారు.

ప్రభుత్వం తన వేయి రోజుల పాలన పూర్తి చేసుకున్న క్రమంలో  బీఆర్‌ఎస్ సర్కార్ వారి మోసాలపైఆందోళనకు దిగిందన్నారు. బాకీ కార్డుల  పేరుతో ప్రభుత్వం ఎవరెవరికి ఎంత బాకీ ఉందో వివరిస్తూ నిరసనలకు పిలుపునిచ్చామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు సకాలంలో అందడం లేదని ఆయన గుర్తు చేస్తూ రైతులకు ప్రభుత్వం దాదాపు రూ. 30 వేల కోట్లు బాకీ పడిందని తెలిపారు.

ఐదేండ్లుగా రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు రూ. 15 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని ఆయన విమర్శించారు. వీటిని ప్రభుత్వం వెంటనే వన్-టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బిల్లులుఉద్యోగుల డీఏలు, పీఆర్సీ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఐదు డీఏలు, పీఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. సివిల్ కాంట్రాక్టర్లకు సుమారు రూ. 4,000 కోట్ల పెండింగ్ బిల్లుల కోసం వారు ఆందోళనలు చేపట్టారన్నారు.

ఈ రెండున్నరేండ్లలో ‘ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు’ అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత వెయ్యి రోజులుగా కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం, ఇతర సదుపాయాల రూపంలో రూ.22 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తీసుకున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఉమ్మేస్తున్నా రన్నారు. అసెంబ్లీ లో కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నలకే సమాధానం చెప్పలేని కాంగ్రెస్ దద్దమ్మలకు కేసీఆర్ వస్తే తట్టుకునే దమ్ము ఉందా అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచులు, పట్టణ, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.