ఇది రజనీ స్టుల్ సినిమా కాదు

06-05-2024 12:05:00 AM

రజినీకాంత్ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితిక సింగ్ తదితరులు నటించిన ఈ సినిమాలో రానా కూడా ఓ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ “ఎప్పటి నుండో రజినీకాంత్ గారితో నటించాలని అనుకునేవాడిని. ‘వేట్టయాన్’ సినిమాతో అది జరిగింది. అయితే ఇది ఆయన స్టుల్ సినిమా కాదు. ఇందులో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ వంటి వాటి ప్రస్తావన ఉంటుంది. దర్శకుడు చాలా పరిశోధన చేసి రాసుకున్న కథ ఇది. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం” అన్నారు. ‘జై భీమ్’ చిత్రంతోనే తన పంథా ఏమిటన్నది చాటారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్. సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమాలోనూ న్యాయ వ్యవస్థని తెరపై చూపించిన ఆయన ఈ చిత్రాన్ని అటువంటి భిన్నమైన అంశాలతో తెరకెక్కించారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉన్న ఈ సినిమా అక్టోబరులో తెర మీదికి రానుంది.