16 April, 2026 | 5:05 AM

మేధస్సుకు ప్రతీక రంగవల్లులు!

10-01-2026 12:00 AM

 డి పున్నంచంద్ :

ముగ్గుల్ని సంస్కృతంలో ‘రంగవల్లులు’ అని, తమిళంలో ‘కోలం’ అని, కన్నడంలో ‘రంగోలీ’ అని, మహారాష్ట్రలో ‘రంగావలీ’ అని, ఒడిశాలో ‘జట్టి’.. ఇలా వివిధ పేర్లతో ఆయా భాషల్లో పిలుస్తుంటారు. 

‘ముంగిట వేసిన ముగ్గులు చూడు

ఓ లచ్చా గుమ్మాడీ..

ముత్యాల ముగ్గులు చూడు

ఓ లచ్చా గుమ్మాడీ..’

మునపటి రోజుల్లో ముంగిట్లో తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గును చూసి ఆ ఇంటి ఇ ల్లాలి నైపుణ్యాన్ని పసిగట్టేవారట! జానపదపాటలకు ఎంత పురాతన చరిత్ర ఉందో ముగ్గులు పెట్టే కళకు అంతటి చరిత్ర ఉంది. మన లెక్కలో చూసుకుంటే అందని కాలం నుంచి స్వచ్ఛంగా, సహజంగా తరతరాలుగా తరలివస్తున్న తేట తెలుగు లాంటి కళ ఇది. ఈ కళకు గురువులు.. అమ్మలు, అమ్మమ్మ లు, నాయనమ్మలయితే.. శిష్యురాండ్లు వాళ్ల కూతుర్లు, మనుమరాళ్లు. ఈ గురు శిష్యల బంధంలో హెచ్చుతగ్గులనేవి ఉండవు.

శిక్షలు లేని శిక్షణ ఉంటుంది. అరమరికలు లేని అనురాగమే ఈ బంధానికి ముడి. ‘ఏ ఇంటి ముందు చిత్రకళ తీర్చిదిద్దబడుతుందో ఆ ఇంటికి సకల శుభాలు కలుగుతా యి’ అని పురాణ వచనాన్ని బట్టి ఈ జానపద కళా స్వరూపం గొప్పదనాన్ని మనం గు ర్తించవచ్చు.

చుక్కలు పెట్టి వాటిని గీతలతో విలువగా ఏర్పడే ఆకారాన్ని ‘బిందుజం’  అంటారు. బిందుజాలు అంటే చుక్కల ముగ్గులే. అయితే ముగ్గుల్లో కూడా ఈ మ ధ్య కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చుక్కలు లేకుండా ముగ్గులు వేసే రీతి ప్రారంభమయ్యింది.

పేరు వేరైనా భావం ఒక్కటే..

ముగ్గుల్ని సంస్కృతంలో ‘రంగవల్లులు’ అని, తమిళంలో ‘కోలం’ అని, కన్నడంలో ‘రంగోలీ’ అని, మహారాష్ట్రలో ‘రంగావలీ’ అని, ఒడిశాలో ‘జట్టి’.. ఇలా వివిధ పేర్లతో ఆయా భాషల్లో పిలుస్తుంటారు. ఇంటిముం దు ఉదయాన్నే చక్కగా ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టడం ఆచారం. ఇది తరతరాలుగా మన భారతీయ సంస్కృతిలో వస్తున్న సంప్రదాయం. ఈ ఆచారంలోనే ఆరోగ్యం ఇమిడి ఉంది. మన ఇళ్లలో కూడా కడిగి ము గ్గులు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుం ది.

ఇక దేవాలయాల ముందు, తులసికోటల వద్ద, వివాహది శుభకార్యాల్లోనూ వే యడానికి రకరకాల ముగ్గులున్నాయి. పూ జా స్థలాల్లో అష్టదళ పద్మం సర్వతో భద్రం ముగ్గులు పెడుతుంటారు. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్టి పండుగలకు పాముల ముగ్గులు పెట్టడం ఆనవాయి తీ. కష్ణాష్టమికి నడిచి వచ్చే చిన్ని కృష్ణుని చిట్టి చిట్టి పాదాలను ముగ్గులుగా పెడుతారు. ఇక సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఇళ్ల ముందు అందమైన రంగువల్లులను వేసుకోవడం మహిళలకు ఆనందదాయకం.

అందుకే సంక్రాంతి పండక్కి ముగ్గుల సౌంద ర్యం చూసి తీరాల్సిందే. అందుకే ఈ పండుగను ముగ్గుల పండుగ అని కూడా పిలు స్తుంటారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు నెల్లాళ్లు స్త్రీలు పోటీ పడి రకరకాల ముగ్గులతో ముంగిళ్లను శో భాయమానం చేస్తుంటారు. ఆ ముగ్గుల్లో బంతి, గుమ్మడి, మందారం, గన్నేరు పూల తో అలంకరించిన గొబ్బెమ్మలను పెట్టి కన్నెపిల్లలు ‘గొబ్బెమ్మ’ పాటలు పాడుతారు.

ముగ్గుల రహస్యం..

సంక్రాంతికి ముందురోజు రోజున ‘భోగి’ పండుగను పురస్కరించుకొని వికసించిన ప ద్మం ఆకారంలో రంగులతో ముగ్గువేసి అం దులో గొబ్బెమ్మల్ని పెడతారు. ఆ ముగ్గునే ‘గొబ్బిముగ్గు’ అని పిలుస్తారు. ఇక సంక్రాం తి రోజున ‘రథం’ ముగ్గు వేయడం ఆనవాయితీ. కనుమ రోజున పెట్టెల ముగ్గు వేస్తా రు. భారతీయ సంస్కృతికి తట్టిన పచ్చ న తోరణాల్లాంటివి ఈ ముగ్గులు. మరి సంక్రాంతి పండుగ నాలుగు రోజులు రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెట్టడం వెను క దాగున్న రహస్యం ఏంటనేది తెలుసుకుందాం.

వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ము గ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల న మ్మకం. పైగా అందమైన ముగ్గులతో లక్ష్మీదేవి ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం.

హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉం ది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారా లు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నా లు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ము గ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శ క్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదిం చడానికి దేవతల చిత్రాలను, లక్ష్మ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది.

శరీరానికి వ్యాయామం..

ముగ్గు అనేది ఓర్పును నేర్పే కళ. ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చా లు.. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయా మం చేసిన శ్రమతో సమానం. ముగ్గు వేయ డం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్ని సార్లు కదలా ల్సి వస్తుంది. ముఖ్యంగా ముగ్గులు వేయ డం వల్ల ఏకాగ్రత అలవడుతుంది. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.

అదొక మానసిక ఉల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే శక్తి సాధనం. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తా యి. తాంత్రిక సాధనలలో భాగమైన యం త్రాన్ని ముగ్గు అంటారు. కొన్ని రకాలైన సా ధనలలో యంత్రాలని నేలపై రకరకాలైన రంగులతో తీర్చి దిద్దుతారు. వస్తువులతో పాటు బలి ఇచ్చే జంతువును యంత్రం (ముగ్గు) మధ్యలో కూర్చోబడతారు. భవిష్యత్తు తెలుసు కోవటానికి కూడా ఎవరినైనా ఒకరిని ముగ్గులో కూర్చో పెట్టి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారు.

చుక్కలు పెట్టి కలపటం, లేదా చుక్కల చుట్టూ మెలి తిప్ప టం ఉండవు. ఆది శంకరుల తరువాత తాం త్రిక సాధనల ప్రాచుర్యం తగ్గింది. యంత్రా లు కొన్ని ముగ్గుల రూపంలో మిగిలి ఉన్నా యి. వీటిని తప్పని సరిగా దేవుడి దగ్గర వే యటం మాత్రమే ఆచారంగా మిగిలి ఉంది. ముగ్గులలో కళాత్మకత ఒక్కటే కాదు నిజమైన భావం కూడా నిండి ఉంది. పురాణ విజ్ఞానం దాగుంది. ఖగోళ పరిజ్ఞానం ఉంది. ప్రకృతి పరిశీలన, అవగాహన, తాదాత్మ్యం కనిపిస్తాయి. ముగ్గులకు పెట్టిన పేర్లు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. 

నైపుణ్యం వెలికితీత..

మారేడు దళం, అష్ట దళ పద్మం, నాగ బంధం మొదలైనవి ముగ్గులకున్న పవిత్రతను సూచిస్తాయి. చేప ముగ్గు, కూర్మం (తాబేలు) మొదలైనవి పురాణ విజ్ఞానాన్ని తెలియ చేస్తాయి. స్వర్గ ద్వారాలు, రథం ఖగోళ విజ్ఞానాన్ని సామాన్యులకు గుర్తు చే స్తాయి. ధనుర్మాస సమయంలో వేసే గుమ్మ డి పండు, వరి కంకులు ఆ సమయంలో వచ్చే పంటలను గుర్తు చేస్తాయి. ఇక మల్లె పందిరి, ఉయ్యాల మంచం.. ఇలా స్త్రీల మనో భావాలకు దర్పణం మాత్రమే కాక వారి సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయి ముగ్గులు. సమకాలిక అంశాలు, భావాలు, ఉద్యమాలు కూడా ముగ్గులలో ప్రత్యక్షమవుతుంటాయి.

స్వతంత్రోద్యమ కాలంలో జెం డాలు ముగ్గులలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ స్వాతంత్య్ర దినం, గణ తంత్ర దినం వంటి సందర్భాలలో జెండాలున్న ముగ్గులు ఎన్నో కనపడతాయి. నక్షత్రాల లాంటి చు క్కలు పెట్టి వాటిని అందంగా కలుపుకునిపోతూ నక్షత్ర మండలం దిగి వచ్చిందనే భ్రాంతి కలిగించగలరు మన మహిళామణులు. వీధిలో ఒక ఇంటి ముగ్గు పక్క ఇంటి ముగ్గుతో కలుపుతూ ఊరి చివర వరకు ఒకే ముగ్గులాగా భావించే విధంగా వేసి సమైక్యతను ప్రదర్శించడం భారతీయ సంప్రదా యంలోని గొప్ప కళగా అభివర్ణించొచ్చు.

 వ్యాసకర్త సెల్: 9030519258