11-01-2026 12:00:00 AM
రేపు స్వామి వివేకానంద జయంతి :
వివేకానందుడు అనగానే మనకు నూతనోత్తేజంతో కాంతులీనే యువశక్తి గుర్తుకు వస్తుంది. మన దేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనులతో ముందు వరుసలో ఉన్నది. సుమారు 27 శాతం యువతతో, అపారమైన మేధో సంపత్తితో మనదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను తమ జీవన విజయంలోకి తద్వారా దేశ ప్రగతికి దోహదపడేలా మలుచుకునే దృఢ సంకల్పం మన యువతలో ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానమే స్వామి వివేకానందుడి జీవి తం.
1863 జనవరి 12న కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచే విజ్ఞానం, ఆధ్యాత్మిక తపై మక్కువ పెంచుకున్నారు. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించి, సన్యాస దీక్షతో స్వామి వివేకానందుడిగా మారారు. 1893లో చికాగో వేదికగా జరిగిన సభలో ‘అమెరికా సోదర సోదరీమణులారా!’ అంటూ ఆయ న చేసిన ప్రసంగం హిందూమత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. 1897లో రామకృష్ణ మిషన్‌ను స్థాపించి దేశభక్తిని, సమాజసేవను ఆధ్యాత్మికతతో ముడిపెట్టిన గొప్ప దార్శనికుడు.
నేటి విద్యావ్యవస్థలో విద్యార్థులు కేవలం మార్కులు, డిగ్రీలు, ఉద్యోగాలే పరమావధిగా బతుకుతున్నారు. ‘మీ జీవితంలో ఒకే ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. దాన్నే ఆలోచించండి, దాన్నే కలగనండి, దానికోసమే జీవించండి.’ అని వివేకానందుడు ఎప్పుడో పేర్కొన్నా రు. యువత కేవలం డిగ్రీల వెంట కాకుండా, ఒక గొప్ప ఆశయం వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి. ఆత్మవిశ్వాసాన్ని మించిన విద్య మరేదీ లేదు. మన దేశంలో 22 శాతం యువత ఓటు హక్కు ద్వారా దేశ భవిష్యత్తు ను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు.
చిన్నపాటి వైఫల్యాలకే యువత కుంగిపోవడం, ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగించే అంశం. తల్లిదండ్రులు సైతం పిల్లల శక్తిని గుర్తించకుండా ఇతరులతో పోల్చడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. వివేకానందుడి తత్వంలో బలహీనతకు తావులేదు. విఫలమైనప్పుడు కుంగిపోకుండా, ఆ విఫలత నుంచే విజయాన్ని నిర్మించుకోవడమే యువత లక్షణం కావాలి. మనిషిని జ్ఞానవంతుడిగా, స్వావలంబిగా మార్చేదే నిజమైన విద్య. ప్రతీ యువకుడు కేవలం ఒక ఉద్యోగిగా మాత్రమే గాక, మార్పుకు దూతగా ఎదగాలి.
‘నాకు కొద్ది మంది నిబద్ధత కలిగిన యువకులను ఇవ్వండి, దేశాన్ని పునర్నిర్మిస్తాను’ అని వివేకానందుడు పేర్కొన్నారు. వివేకానందుని మాటలను పుస్తకాల్లో చదవడం కాదు, జీవితంలో ఆచరించా లి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మొదలు కుటీర పరిశ్రమల వరకు భారతీయుల ముద్ర స్పష్టంగా కనిపించేలా చేయడం మన భారతీయుల్లో ఉన్న గొప్పదనం. కానీ దురదృష్టవశాత్తు కొందరు యువకు లు తమ శక్తిని గుర్తించలేక వ్యసనాలకు బానిసలవుతున్నారు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత జీవితాల్లోని సంక్షోభాల నివారణకు అందరం చేయూతనిద్దాం. రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యమైన డ్రగ్ రోహిత ‘ప్రభాత భేరి’ ఉద్యమాన్ని వాడవాడకు తీసుకుపోదాం. వివేకానందుడి ఆశయ సాధనలో అందరం భాగస్వా ములమవుదాం. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచం ముందు ఎలుగెత్తి చాటుదాం.
డా.నామోజు బాలాచారి