రంజిత్‌రెడ్డి కోడిగుడ్ల దొంగ
చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మహేశ్వరం,ఏప్రిల్ 9(విజయక్రాంతి): చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి కోడిగుడ్ల దొంగ అని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో మంఖాల్, సర్ధార్‌పటేల్‌నగర్, రావిర్యాల గ్రామాల్లో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రంజిత్‌రెడ్డి చిన్న పిల్లలు తినే గుడ్లతో పాటు కోళ్ల దాణా స్కాం చేశారని ఆరోపించారు.
దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ ప్రతిరోజు 18 గంటల పాటు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. దేశంలో మోదీ మచ్చలేని నాయకు డని అన్నారు. దేశంలో మోదీ ప్రభజనం కొనసాగుతుందని, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కందుకూర్ మండలం ఆకుల మైలారం, మాలగూడ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఎంపీటీసీ పద్మపాండు, అచ్చెన సురేశ్, కృష్ణ కుమార్‌లతో పాటు పలువురు నాయకులు, కార్య కర్తలు బీజేపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అందెల కండువా కప్పి ఆహ్వానించారు. ప్రపంచ దేశాలు మెచ్చుకునే నాయకుల్లో దేశ ప్రధాని మోదీ ఒక్కరన్నారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, మదన్ మోహన్, శివకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






