ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తా
బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్, మే 9 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ గత ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని చెప్పారని, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బాధితుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ తెరుస్తానని ఆ తర్వాత మోసగించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ఇప్పుడు లేనిపోని సాకులు చెప్తున్నదని మండిపడ్డారు. ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం ఇస్తానని ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
రాష్ట్రంలో బీడీ కార్మికులకు ఇప్పుడు పింఛను అందుతున్నదంటే అందుకు కారణం ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు. తాను 1994 లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటి చేసినప్పడు ఆర్మూర్ ప్రజలు తనను ఆదరించారని, తిరిగి మరోసారి గెలిపించాలని కోరారు. కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ ఎమ్మెల్యేల మద్దతుతో తాను ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.






