2 August, 2026 | 3:00 AM

అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి

15-06-2026 08:50 PM

బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకులు జనిగ సందీప్

హుజూర్ నగర్: అర్హులైన పేదలకు అందాల్సిన రేషన్ కార్డులను అక్రమంగా పొందిన ప్రభుత్వ ఉద్యోగుల కార్డులను వెంటనే తొలగించాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు జనిగ సందీప్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో  ఆర్డీవోకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉండే అవకాశం లేకపోయినా, కొందరు అక్రమంగా వాటిని పొంది ప్రజా పంపిణీ వ్యవస్థలోని బియ్యం, ఇతర రాయితీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన పేదలకు అందాల్సిన లబ్ధి అందని ద్రాక్షలా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డులను రద్దు చేయాలని కోరారు. అర్హులైన పేదలకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.