పోలీసుల కనుసన్నల్లోనే రేవ్ పార్టీ ?
బెంగళూరు, మే 24: బెంగళూరు శివారులోని హెబ్బగొడి జీఆర్ ఫాం హౌస్‌లో ఆదివారం రాత్రి ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో జరిగిన రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. పోలీసుల కనుసన్నల్లోనే పార్టీ జరిగినట్లు, పార్టీపై పోలీ సులకు ముందస్తు సమాచారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలోని విజయవాడకు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసి, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వా ర్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు రేవ్ పార్టీ నిర్వహణలో పోలీసుల ప్రమేయంపై బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున్ బాలదండి సీరియస్‌గా స్పందించారు.
గురువారం రాత్రి హెబ్బగొడి పోలీస్‌స్టేషన్ ఏఎస్సై నారాయణస్వామితో పాటు ఇద్దరు పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై వేటు వేశామని ఎస్పీ ప్రకటిం చారు. రేవ్ పార్టీ కేసును కర్ణాటక సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) వేగవంతంగా విచారణ చేపడుతున్నది. ఈ కేసుతో తెలుగు నటి హేమ ప్రమేయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఇప్పటికే హేమ పార్టీలో డ్రగ్స్ తీసుకు న్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మరోవైపు మ రోనటి ఆషిరాయ్ కూడా రేవ్ పార్టీపై స్పంది ంచారు. తాను పార్టీకి వెళ్లింది వాస్తవమేనని, కానీ అక్కడ డ్రగ్స్ విక్రయం, వినియోగం జరుగుతుందని తెలియదని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.






