అన్నీ తెలిసే యాక్సిడెంట్ చేశాడు
ముంబై, మే 24: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోర్షే కారు యాక్సిడెంట్ కేసులో రోజురోజుకూ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యాక్సిడెంట్ చేసి ఇద్దరి మృతికి కారణమైన మైనర్ బాలుడికి పోలీసులు సపర్యలు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ కేసు విచారణకు సంబంధించి శుక్రవారం పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలసి వివరాలు వెల్లడించారు. మైనర్ యువకుడికి సంబంధించి విచారణ జరిపేందుకు ఆల్కహాల్ రిపోర్టులు ముఖ్యం కాదని, అతడు పూర్తి తెలివిడితోనే యాక్సిడెంట్ చేశాడని సీపీ అమితేశ్ కుమార్ పేర్కొన్నారు.
‘ఆల్కహాల్ తీసుకోవడం వల్లే అతడు యాక్సిడెంట్ చేశాడని చెప్పడం సరికాదు. రక్త పరీక్షలతో సంబంధం లేకుండా.. యాక్సిడెంట్ చేసే సమయంలో మైనర్ బాలుడు తెలివిడితో ఉన్నాడు. ఆల్కహాల్ తీసుకోవడం, ఆ తర్వాత సన్నని దారుల్లో కారు నడపం నేరమని, అలా నడిపితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందనే విషయంపై అతడికి అవగాహన ఉంది’ అని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని, సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టామని, కేసు దర్యాప్తును సీరియస్‌గా చేస్తున్నామని ఆయన తెలిపారు.
సెక్షన్ 304 కింద కేసు నమోదు
సాధారణంగా యాక్సిడెంట్ కేసుల్లో ఐసీపీ సెక్షన్ 304 (ఎ) కింద కేసులు నమోదు చేస్తామని, అయితే మైనర్ బాలుడి యాక్సిడెంట్ తీవ్రతను బట్టి సెక్షన్ 304 నమోదు చేశామని సీపీ చెప్పారు. ఈ కేసులో పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వివరించారు. బాలుడి తండ్రిపై, బార్ ఓనర్లపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశామని చెప్పారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు.






