పచ్చి రొట్ట.. దిగుబడిలో దిట్ట!
కీలకంగా మారనున్న ఎరువు
సమగ్ర పోషకాలకు నిలయం
చౌడు భూములకు మేలు
వరంగల్, జూన్ ౯ (విజయక్రాంతి): పంటల దిగుబడిలో ‘పచ్చిరొట్ట’ ఎరువు కీలకంగా మారుతోంది. సేంద్రియ వ్యవసాయంలో దీనికి ఎంతో ప్రాధాన్యం లభిస్తోంది. నేలకు కావాల్సిన సమగ్ర పోషకాలకు చిరునామాగా నిలుస్తోంది. అధిక దిగుబడి సాధించాలనే ఆశతో రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగించడంతో నేలల్లో భూసారం దెబ్బతిని పోషక పదార్థాల లోపంతో సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు పద్ధతులుగా వాడుకునే పచ్చిరొట్ట పైర్ల మూలంగా రైతులకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
v పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లి అవి పెరిగిన తర్వాత అదే పొలంలో అక్కడికక్కడే భూమిలో కలియదున్ని తర్వాత పంట వేసుకోవడం. పైర్లు కుళ్లడానికి సరిపోయే రోజులు ముందుగా కలియదున్నాలి. 50 శాతం పూత వచ్చిన తర్వాత పంటను కలియదున్నాలి.
v చెట్ల ఆకులు బయటి నుంచి సేకరించి పొలంలో వేసి కలియదున్ని అవి కుళ్లిన తర్వాత పంట వేసుకోవాలి.
ఏ సమయంలో వేయాలంటే..
రైతులు ఖరీఫ్ పంటల సాగుకు ముందు వేసవి (మే, జూన్)లో తొలకరి వర్షాలు పడిన వెంటనే దుక్కి దున్ని ఎకరాలకు 12 నుంచి 15 కిలోల విత్తనాలు చల్లాలి. జనుము అయితే ఎకరాకు 20 కిలోలు వేయాలి. దీర్ఘకాలిక పంటలు, పండ్ల తోటల్లో వరుసల మధ్య పచ్చిరొట్ట పైరు వేసి పెరిగిన తర్వాత ఆ భూమిలోనే దున్నాలి.
పచ్చిరొట్టతో అధిక ప్రయోజనాలు
v పచ్చిరొట్టలో సేంద్రియ పదార్థం ఉండటంతో సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
v భూమిని గుల్లబరిచి నీటి నిలువ సామర్థ్యం పెంచి సులభంగా నీరు, గాలి వేర్లకు అందేలా చేస్తుంది.
v పచ్చిరొట్ట పైర్ల సాగుతో సూక్ష్మపోషక పదార్థాలకు సంబంధించిన లోపాలు రాకుండా ఉంటాయి.
v పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి.
v చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు పప్పు జాతికి చెందినవి కావడంతో గాలిలోని నత్రజని స్థిరీకరిస్తాయి.
v పాల చౌడు, నల్ల చౌడును నివారిస్తుంది.
v భూసార పరిరక్షణకు తోడ్పడుతుంది.






