10 July, 2026 | 4:35 PM

సర్కారు పనులకు మో‘డల్’!

10-06-2024 02:12 AM

భవనాలిలా.. చదువులు సాగేదెలా?

అర్ధంతరంగా నిలిచిన స్కూల్, హాస్టల్ భవనాలు

అధికారుల అలసత్వం కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యం

12 నుంచి ప్రారంభం కానున్న విద్యాసంస్థలు

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 9(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన మోడల్ ఆదర్శ పాఠశాలలో చదువులు ముందుకు సాగేలా కన్పిం చడం లేదు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యం విద్యార్థులపాలిట శాపంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపహాడ్ మోడల్ స్కూల్, బాలికలకు వసతి కల్పించేందుకు ప్రభుత్వం మంజూరుచేసిన భవన నిర్మాణాలు ఎనిమిదేండ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యం అధికారుల అలసత్వం మూలంగా నీరుగారిపోతోంది.

రూ.1.28కోట్లతో నిర్మానాలు

గత ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్ అభియాన్ ద్వారా మోడల్ స్కూల్, హాస్టల్ భవన నిర్మాణం కోసం రూ.1.28కోట్ల నిధు లు మంజూరీచేసింది. వసతి గృహంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుకునే వంద మంది విద్యార్ధినులకు వసతులు కల్పిస్తారు. 2016లో అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే కాం ట్రాక్టర్ పనులు ప్రారంభించి స్లాబ్ కంప్లీట్ చేసి మధ్యలోనే వదిలేశాడు.  

అసంపూర్తిగా నిర్మాణం

2012 విద్యా సంవత్సరంలో నిర్మించిన మోడల్‌స్కూల్ భవన నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆనాడు స్కూల్‌ను పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఎనిమిది గదులను నిర్మించకుండానే అసంపూర్తిగా వదిలేశాడు. గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ల్యాబ్, ఆఫీస్‌రూం, లైబ్రరీ రూంలలో క్లాసులు నిర్వహిస్తున్నారు. 6నుంచి 12వరకు ఉన్న ఈ పాఠశాలలో 423మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.  

తగ్గనున్న దూరభారం

హాస్టల్ బిల్డింగ్ పూర్తయితే అనేక మంది పేద విద్యార్థులకు దూరభారం తగ్గుతుంది.  ఈ వసతి గృహంలో 15కిలోమీటర్ల దూరంలోగల వంద మంది విద్యార్ధులకు సీట్లు కేటాయిస్తారు. వారికి భోజన వసతితో పాటు ఇతర వసతులు సమకూర్చుతారు. ప్రస్తుతం వీరంతా నెలకు రూ.వెయ్యి రూపాయల నుంచి రూ.౧౫౦౦ వరకు చెల్లి ంచి ఆటో, జీపుల్లో వెళ్తున్నారు. అధికారులు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని హస్టల్ భవనం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.   

విద్యార్దులకు సరిపడా గదులు లేక

దొబ్బలపాడు మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో 423 మంది చదువుకుంటున్నారు. వీరికి సరిపడా గదులులేవు. సరిపడా లేక ల్యాబ్, ఇతర యాక్టివిటీస్ రూంలలో క్లాస్‌లు నిర్వహి స్తున్నం. 14క్లాస్ రూంలు అవసరం ఉంటే కేవలం ఆరు రూంలు మాత్రమే ఉన్నవి. 

 రాజు, ప్రిన్సిపాల్, 

మోడల్ స్కూల్, దొబ్బలపాడు జయశంకర్ భూపాలపల్లి