హన్మగల్‌లో భూ పోరాటం
ఇందిరమ్మ టవర్స్ స్థలంపై పేదల ధర్నా
ఇండ్ల కేటాయింపులో అవకాశం కల్పిస్తామని ఆర్డీవో హామీ
రంగారెడ్డి, ఆగస్టు 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల పరిధిలోని హన్మగల్ ముదిరాజ్ కాలనీ (సర్వే నెం. 255/1) లోని 18 ఎకరాల భూమిపై వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు, పేద బాధితులు అఖిలపక్ష నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
బాధితుల నిరసన:
గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను తాము కొనుగోలు చేశామని, ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం అన్యాయమని బాధితులు ఆందోళన చేశారు. బాధితులకు విదవు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బిజెపి నాయకుడు సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, తిరుమల రెడ్డి, నర్సింహా రెడ్డి తదితరులు బాధితులకు మద్దతుగా నిలిచి పోరాడతామని ప్రకటించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఆర్డీవో స్పష్టత:
సంఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 1974లో ఇచ్చిన ’ఏక్ సాల్ పట్టాల’ వల్ల ఎవరికీ చట్టపరమైన హక్కులు రావు అని, 1985 నుంచి ఇది ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పేదల కోసం ఇక్కడ 480 ఇండ్లతో ‘ఇందిరమ్మ టవర్’ నిర్మిస్తున్నామని, భూమి కోల్పోయి నష్టపోయిన అర్హులైన బాధితులకు ఈ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆర్డీవో బాధితులకు హామీ ఇచ్చారు.






