రికార్డుల సవరణ అధికారం ఆర్డీవోకు లేదు
స్పష్టం చేసిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): భూమి రికార్డులను సుమోటోగా తీసుకుని పరిశీలించే అధికారం గానీ, వాటిని సవరించే అధికారంగానీ ఆర్డీవోకు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని సర్వే నంబర్ 23, 24లో 50 ఎకరాల భూములను తలాబ్ చెరువు సర్కారీగా పేర్కొంటూ ఆర్డీవో జారీచేసిన ప్రొసీడింగ్స్ రద్దు చేస్తూ గతంలో ఉన్న ఎంట్రీలను పునరుద్ధరించాలని ఆదేశించింది. పట్టాదారులు, స్వాధీనంలో ఉన్నట్టు ఎంట్రీలను సవరించాలని ఆదేశించింది. అయితే ఈ భూములపై అనుమానాలుంటే కలెక్టర్ తాజాగా విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని సూచించింది.
న్యాల్కల్‌లో తలాబ్ చెరువుకు సంబంధించిన 2015 మేలో ఆర్డీవో జారీచేసిన ప్రొసీడింగ్స్‌ని ఎమ్మార్వో అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ గఫార్ అలీ పిల్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆర్డీవో ఉత్తర్వులను సవాలు చేస్తూ పట్టాదారులు కూడా మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీచేసింది.
55 ఏళ్ల తరువాత ఆర్డీవో భూములపై చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు జారీచేయడం చెల్లదన్న పట్టాదారుల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. అధికారిక ఎంట్రీలను పరిశీలించి సుమోటోగా వాటిని సవరించే అధికారం ఆర్డీవోకు లేదని తేల్చిచెప్పింది. ఈ భూమిని తలాబ్ చెరువు భూమిగా పేర్కొంటూ 2015లో ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.
మేజిస్ట్రేట్‌ను ఇంటి దగ్గరికే తీసుకెళ్లండి
అంధబాలిక వాంగ్మూలం నమోదుపై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): అత్యాచారానికి గురైన అంధ బాలిక వాంగ్మూలం నమోదు చేయడానికి మేజిస్ట్రేట్‌ను ఇంటికి తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేయించాలని పోలీసులను సోమవారం హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ మలక్‌పేటలోని అంధ బాలికల వసతి గృహంలో ఓ బాలికపై మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వచ్చిన నరేశ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడగా, కేసు నమోదైన విషయం విధితమే. ఈ కేసులో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాలని దర్యాప్తు అధికారి ఒత్తిడి తీసుకొస్తుండటంతో తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ అత్యాచార ఘటనతో బాలిక భయభ్రాంతులకు గురవుతుండగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని పోలీసులు పట్టుపడుతున్నారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి సమీపం లోని మేజిస్ట్రేట్‌ను బాలిక ఇంటికి తీసుకెళ్లి వాంగ్మూలం నమోదుకు ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
న్యాయవాదిపై పోలీసుల దాడి
నివేదిక తెప్పించుకున్న హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): హైదరాబాద్ కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ న్యాయవాది కే సంతోష్ కుమార్‌పై ఈ నెల 16న పోలీసులు దాడి చేసిన ఘటనపై హైకోర్టు స్పందించింది. సోమవారం హైకోర్టు ప్రారంభంకాగానే చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రవీందర్‌రెడ్డి.. న్యాయవాదిపై పోలీసుల దాడి ఘటనను ప్రస్తావించారు. దాడికి నిరసనగా న్యాయవాదులు విధుల్ని బహిష్కరిస్తున్నారని చెప్పారు. దాడికి పాల్పడిన బోరబండ పోలీసుల తీరుపై నివేదిక సమర్పించాలని హైకోర్టు, రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.
ఆ ఘటనపై రిజిస్ట్రార్ జనరల్ పోలీసుల నుంచి నివేదిక తెప్పించి ధర్మాసనానికి అందజేశారు. న్యాయవాదులపైనే కాకుండా ప్రజలపై కూడా పోలీసులు దాడులు చేయకుండా తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని మౌఖికంగా ఆదేశించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి సారథ్యంలో ప్రతినిధులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధేను కలిసి వినతి పత్రం సమర్పించారు. న్యాయవాదిపై దాడికి కారణమైన పోలీసులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.






