రాజ్యసభకు సింఘ్వీ నామినేషన్
- సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మున్షీ హాజరు
- ఈనెల 21 వరకు నామినేషన్ దాఖలుకు గడవు
- బీఆర్‌ఎస్ బరిలో దిగితే ఎన్నిక .. లేదంటే ఏకగ్రీవమే
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పలువురు మంత్రులు ఉన్నారు. ఈ నెల 21 వరకు రాజ్యసభకు నామినేషన్ సమర్పించడానికి గడువు ఉంది. బీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించిన కే కేశవరావు కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
నామినేషన్ వేయడానికి ఇంకా రెండు రోజులు గడువు ఉండటంతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందా? దూరంగా ఉంటుందా? అనేది ఆసక్తిగా మారింది. బీఆర్‌ఎస్ దూరంగా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు. ఒక వేళ బీఆర్‌ఎస్ బరిలోకి దిగితే మాత్రం సెప్టెంబర్ 3న ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. నామినేషన్ అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అభిషేక్‌మను సింఘ్వీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అభిషేక్ సింఘ్వీది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని, రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎంపిక కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు సింఘ్వీ సుదీర్ఘ సేవలు
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించిన సింఘ్వీ ఆ పార్టీకి సుదీర్ఘ సేవలు అందిస్తున్నారు. 2001 నుంచి ఏఐసీసీ అధికార ప్రతినిధిగా, రెండు దఫాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యస భ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీచేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు తెలంగాణ నుంచి రాజ్యసభకు బరిలో దిగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్‌కు కీలకమైనందున పార్టీ అధిష్ఠానం ఆయనను ఎంపిక చేసిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.






