6 April, 2026 | 11:59 AM

లక్ష మందిని చదివిస్తం!

30-10-2024 02:31 AM
  1. ఏపీలో విద్యాభివృద్ధికి సహకారం
  2. ముందుకొచ్చిన రేమండ్ గ్రూప్
  3. సీఎం బాబుతో గ్రూప్ చైర్మన్ సింఘానియా భేటీ
  4. సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాలలు దత్తత

అమరావతి, అక్టోబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది పేద విద్యార్థులకు నాణ్యమై న విద్య అందించేందుకు రేమండ్ గ్రూప్ ముందుకొచ్చింది. పాఠశాలలను దత్తత తీసుకోవటంతోపాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించటం ద్వారా ‘కనెక్ట్ టు ఆంధ్ర’ పేరుతో ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌కు తమవంతు సాయం అందిస్తామని గ్రూప్ చైర్మన్ గౌతంహరి సింఘానియా ప్రకటించారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో సింఘానియా, ఆ సంస్థ ఆడిట్ కమిటీ చైర్మన్ కే నరసింహమూర్తి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్‌కు సింఘానియా రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. హిందూపూర్ జిల్లాలో విద్యాభివృద్ధికి తమ కంపెనీకి చెందిన సీఎస్‌ఆర్ నిధులను వెచ్చిస్తామని సింఘానియా హామీ ఇచ్చారు. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర హై అండ్ ఎలిమెంటరీ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు మద్దతిస్తామని తెలిపారు.  

హిందూపూర్‌లో రేమండ్ ఫ్యాక్టరీ

రేమండ్ గ్రూప్ హిందూపూర్ జిల్లాలో అత్యాధునిక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని నలకొల్పింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ కంపెనీకి ఏపీతో ఆధ్యాత్మిక సంబంధాలు కూడా ఉన్నాయి. టీటీడీ ముంబై సమీపంలోని నవీ ముంబైలో ౧౦ ఎకరాల్లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని రేమండ్ సంస్థే నిర్మించి ఇస్తున్నది.

ఈ ఆలయానికి మహారాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వగా, రేమండ్ గ్రూప్ తన నిధులతో ఆలయాన్ని నిర్మిస్తున్నది. ఈ ఆలయం వచ్చే ఏడాది సెప్టెంబర్ 10న టీటీడీకి అప్పగించనున్నారు. ఆ తేదీతో రేమండ్ గ్రూప్ స్థాపిం చి వందేండ్లు పూర్తకానుండటం విశేషం. 

ఆడిటింగ్‌లో అపర మేధావి నరసింహమూర్తి

రేమండ్ గ్రూప్ ఆడిటింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కే నరసింహమూర్తికి భారతదేశ పారిశ్రామిక రంగంలో ప్రత్యేక స్థానం ఉన్నది. చార్టర్డ్ అకౌంటెంట్, ఐసీడబ్ల్యూ కోర్సులు చదివిన ఆయనకు ఆడిటింగ్ రంగంలో తిరుగులేని, మచ్చలేని రికార్డు ఉన్నది. 1983లో కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ వృత్తిలోకి ప్రవేశించిన నరసింహమూర్తి.. అనేక ప్రతిష్ఠాత్మక పదవులను అలంకరించారు.

50 పరిశ్రమలకు చెందిన 175 కంపెనీలకు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయటంలో కీలకపాత్ర పోషించారు. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (2020-23), ఓఎన్జీసీ (2013-16), ఐడీబీఐ బ్యాంక్ (2001-11), ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (2005-15), యూటీఐ బ్యాంక్ (ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్) (1999-2004)లకు డైరెక్టర్‌గా పనిచేశారు.

నాబార్డు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్‌సీఐ, ఎస్‌టీసీఐ ఫైనాన్స్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర సంస్థలకు పర్యవేక్షణ బోర్డు సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం రేమండ్ లిమిటెడ్, యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్, నెల్కో, రేమండ్ లైఫ్‌స్టయిల్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యాక్స్ లైఫ్ పెన్షన్ అండళ్ ఫండ్ కంపెనీ లిమిటెడ్, మైనీ ప్రెసిషన్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.