31 July, 2026 | 1:15 AM

నేతన్నకు భరోసా.. సిరిసిల్లకు కొత్త శోభ

31-07-2026 12:52 AM
  1. రూ.3.22 కోట్లతో రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు 
  2. మంత్రులు అడ్లూరి, తుమ్మల, పొన్నం లచే ప్రారంభోత్సవాలు

సిరిసిల్ల, జూలై 30, (విజయ క్రాంతి):సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.సిరిసిల్ల రగుడు జంక్షన్ వద్ద రూ.3.22 కోట్లతో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ, మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులు ప్రారంభించారు.అనంతరం కలెక్టరేట్లో త్రిఫ్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్డీ పాస్బుక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత రెండేళ్లలో చేనేత రంగానికి రూ.1,360 కోట్లకు పైగా సహాయం అందించామని, నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమలో బకాయిలను చెల్లించి నేతన్నలకు భరోసా కల్పించామని, 202425లో 6.80 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లతో వేలాది మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రూ.62 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వెల్లడించారు.సిరిసిల్ల చీరలకు మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరలు నాణ్యతతో తయారవుతున్నాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.