calender_icon.png 21 February, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యూయర్‌షిప్‌లో రికార్డు

21-02-2026 01:24:01 AM

పాక్ బాయ్‌కాట్ డ్రామాతో మరింత ఆసక్తి

వీక్షణల్లో జియో రికార్డుల మోత

ముంబై , ఫిబ్రవరి 20: ప్రపంచ క్రికెట్‌లో భారత్ ,పాకిస్థాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే చాలు రెండు దేశాల అభిమానులే కాదు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి మొత్తం అక్కడే ఉంటుంది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో భారత్, పాక్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. అది కూడా తటస్థ వేదికలపైనే ఆడుతున్నాయి. గత ఏడాది ఆసియాకప్ సమయంలో మొదలైన హ్యాండ్ షేక్ వివాదం ఇటీవల ప్రపంచకప్ కు కూడా పాకింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఇరు దేశాల మ్యాచ్‌పై ఎక్కడలేని ఆసక్తి కనిపించింది. దీనికి తోడు భారత్ తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తామంటూ పాక్ బోర్డు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

చివరికి ఐసీసీ వార్నింగ్‌తో అన్నీ మూసుకుని మ్యాచ్ ఆడింది. అయితే పాక్ చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు స్పాన్సర్లకు, బ్రాడ్ కాస్టర్లకు మరింత మేలు చేసింది. కొలంబో వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌కు రికార్డ్ వ్యూయర్ షిప్ దక్కింది. చివరి నిమిషం వరకూ మ్యాచ్ ఆడడంపై తర్జనభర్జన పడి చివరికి బ్రాడ్ కాస్టర్లు, ఐసీసీ వార్నింగ్ తో దిగొచ్చిన పాక్ మ్యాచ్ ఆడింది. భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడిపోయింది. పాక్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ చేసిన ఓవరాక్షన్ తో ఈ మ్యాచ్‌పై ఆసక్తి రెట్టింపయింది. జియో హాట్ స్టార్ తాజాగా వెల్లడించిన వ్యూయర్ షిప్ వివరాలు చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది.

ఈ మ్యాచ్ డిజిటల్ రీచ్ ఏకంగా 163 మిలియన్లుగా నమోదైంది. అంటే 16.30 కోట్ల వ్యూయర్ షిప్ కేవలం డిజిటల్ ఫ్లాట్ ఫాంపైనే వచ్చింది. ఒక ఐసీసీ ఈవెంట్‌లో మ్యాచ్ కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ రావడం ఇదే తొలిసారి. గత 2024 ప్రపంచకప్ ఫైనల్ వ్యూయర్ షిప్ రికార్డును తాజా మ్యాచ్ బద్దలు కొట్టింది. జియో లెక్కల ప్రకారం 56 శాతం వ్యూయర్ షిప్ పెరిగింది. అలాగే 2024 ప్రపంచకప్ లో భారత్, పాక్ మ్యాచ్ కంటే ఇది 2.4  రెట్లు ఎక్కువ. అటు టీవీఆర్ రేటింగ్స్‌లోనూ 71 శాతం మెరుగుదల నమోదైంది. 2021 టీ20 వరల్ కప్ తర్వాత భారత్, పాక్ మ్యాచ్ వ్యూయర్ షిప్ ఇన్ని రికార్డులు సృష్టించడం ఇదే తొలిసారి.