ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
100 అడుగుల ఎత్తు నుంచి దూకి నీట మునిగిన యువకుడు
న్యూఢిల్లీ, మే 22: యువతకు రీల్స్ పిచ్చి ఎక్కువైంది. సోషల్ మీడియాలో పాపులర్ కావాలని రీల్స్ పేరిట చేస్తున్న పిచ్చి పనులు వారి ప్రాణాలనే తీస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు 100 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకి మృతిచెందిన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రం సాహిబ్ గంజ్‌లో మంగళవారం జరిగింది. తౌసిఫ్ అనే 18 ఏళ్ల యువకుడు స్నేహితులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు.
తాను కొండపైకి వెళ్లి నీటిలోకి దూకుతానని, ఆ సమయంలో వీడియో తీయాలని స్నేహితులకు చెప్పాడు. అతడు 100 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకగా స్నేహితులు వీడియో తీశారు. అయితే, అంత ఎత్తు నుంచి చెరువులోకి దూకడంతో తౌసిఫ్ తీవ్రంగా గాయపడి నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు అతనిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు.






