2 August, 2026 | 6:57 PM

ఆ సర్టిఫికెట్లు చెల్లవు

23-05-2024 03:54 AM

బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు షాక్

2010 నుంచి జారీచేసిన ఓబీసీ ధ్రువపత్రాలు రద్దు 

కోర్టు తీర్పును అంగీకరించేది లేదన్న మమత

కోల్‌కతా, మే 22: పశ్చిమ్ బెంగాల్‌లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు బుధవారం రద్దు చేసింది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల చట్టం లోని సెక్షన్లు 2హెచ్, 5, 6, 16తో పాటు షెడ్యూళ్లు I, III రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ మేరకు 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను కోర్టు చెల్లవని చెప్పింది. అయితే, ఈ తీర్పు ఇప్పటికే ఈ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొంది సర్వీసుల్లో ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపవని హైకోర్టు  తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సవాల్ చేస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై విచారించిన జస్టిస్ తాపబ్రాత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంతతో కూడిన డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు 2011 నుంచి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వ హయాం లో ఇచ్చిన 5 లక్షల ఓబీసీ ధ్రువపత్రాలను చెల్లవని కోర్టు చెప్పింది. అయితే, హైకోర్టు ఆదేశాలను అంగీకరించేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. ఓ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. బీజేపీ వల్ల ఇప్పటికే 26 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. అప్పుడు కూడా నేను ఆ తీర్పును అంగీకరించలేదన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ ఆదేశాలను పట్టించుకోనని తెలిపారు. వారి ధైర్యం చూడండి.. ఇది దేశ చరిత్రలో చీకటి అధ్యాయం అని బీజేపీపై మండిపడ్డారు.