ప్రాంతీయ పార్టీలదే హవా

01-05-2024 01:23:34 AM

ఎన్డీఏకు 200కు మించి ఎంపీ సీట్లు రావు

కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలు

గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలం

రాజకీయ కక్ష సాధింపుతో కవితను అరెస్టు చేశారు

జాతీయ వార్తా సంస్థతో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడుతున్నాయని, లోక్‌సభ ఎన్నికల తర్వాత చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. బస్సుయాత్రలో ఉన్న ఆయన కొత్తగూడెం వెళ్తున్న సమయంలో మంగళవారం ఓ జాతీయ వార్తాసంస్థతో మాట్లాడారు. ఇండియా కూటమి ఉనికి ఎక్కడా లేదని, దానిని ఏర్పాటుచేసిన ఆరు నెలలకే పార్టీలన్నీ విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీఏకు 200కు మించి ఎంపీ సీట్లు రావని తేల్చిచెప్పారు. 400 సీట్లు సాధిస్తామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటున్నదని విమర్శించారు. పలు రాష్రాల్లో ఎన్డీఏ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని, రెండో విడత ఎన్నికల్లో ఆ కూటమి వెనకబడిపోయిందని పలు సర్వేలు తేల్చాయని తెలిపారు. 

కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇంతవరకు ఒకటి కూడా అమలు చేయలేదని, రైతుబంధుపై రేవంత్ ప్రభుత్వం మాట తప్పిందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని విమర్శించారు. ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వక పోవడంతో అన్నదాతలు సర్కార్‌పై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అవినీతి గురించి దేశం మొత్తం తెలుసుని, అది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు.

12 సీట్లు గెలుస్తాం

రాష్ట్రంలో 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని కేసీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలకు బీ టీమ్‌గా పనిచేస్తుందని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను లెప్టినెంట్ గవర్నర్‌తో బెదిరింపులకు గురిచేసినా మాట వినకపోవడంతో లిక్కర్ స్కాం పేరుతో జైల్లో వేశారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపనీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని తెలిసి ఈ కుట్రలు చేసింద ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసం మోదీ ఎంతకైనా దిగుజారుతారని  ఆగ్రహం వ్యక్తంచేశారు. కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని అన్నారు. 

లిక్కర్ స్కాం మోదీ నాటకం

కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ బీజేపీ జేబు సంస్థలుగా మారాయని కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలనలో సంపద విదేశాలకు తరలిపోతున్నదని అన్నారు. నల్లధనం తీసుకొస్తానని గత ఎన్నికల్లో బీజేపీ నాయకులు ప్రజలను నమ్మించారని, ఈ ఎన్నికల్లో వారి మాటలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ నేతలు నమ్మిన ప్రజలను మోసం చేసే దగాకోరులని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లాభం కోసమే లిక్కర్ స్కాం పేరుతో తనకు అనుకూలంగా లేని ప్రాంతీయ పార్టీలను మోదీ వేధిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మోదీ సృష్టించిన నాటకమని విమర్శించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కమలం పార్టీ నేతలు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడంలో తప్పులేదని బీజేపీ నాయకులు పదేపదే చెప్తున్నారని మండిపడ్డారు.