13 July, 2026 | 7:33 PM

పెళ్లికి వెళ్లి రోడ్డుప్రమాదంలో అన్నదమ్ములు మృతి

21-05-2024 05:24 PM

హైదరాబాద్: జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రామవరంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చూడటానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. మృతులను శ్రవణ్(29), శివ(27)గా గుర్తించారు. శ్రవణ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శివ పెళ్లి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. పెళ్లి అవ్వగానే ఆదివారం రాత్రి శ్రవణ్, శివ వాళ్ల కజిన్ తో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తుండగా రోడ్డుప్రమాదం జరిగింది. ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రున్ని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.