24 May, 2026 | 1:52 AM

పిల్లల మిస్సింగ్‌పై కిడ్నాప్ కేసులుగా నమోదు చేయండి

24-05-2026 01:02 AM
  1. కాపాడిన పిల్లలను 24 గంటల్లో కుటుంబాలకు అప్పగించాలి
  2. కుటుంబాలపై అనుమానం ఉంటే, వారి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి
  3. సుప్రీం కోర్టు కీలక మార్గదర్శకాలు
  4. దేశవ్యాప్తంగా 47 వేల మంది పిల్లల మిస్సింగ్‌పై విస్మయం
  5. ఆచూకీ లభించే వరకు దర్యాప్తు కొనసాగించాల్సిందేనని ఆదేశాలు

న్యూఢిల్లీ, మే ౨౩: దేశంలో పిల్లలు కనిపించకుండా పోతే ఇకపై వాటిని సాధారణ మిస్సింగ్ కేసులుగా కాకుండా కిడ్నాప్ (అపహరణ) కేసులుగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ చిన్న మార్పుతో మిస్సింగ్ కేసుల దర్యాప్తు సత్వరం పూర్తిచేసేందుకు వీలవుతుందని, తద్వారా కేసుల్లో జాప్యాన్నీ నివారించవచ్చని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 47 వేల మంది పిల్లల ఆచూకీ లభించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

కేసులను ఛేదించేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న డేటాబేస్‌లను ఒకదానితో ఒకటి అనుసంధా నం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను ఆదేశించింది. పోలీసుల వద్ద ఉన్న సమాచారం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీల డేటా ఇకపై ఎప్పటికప్పుడు పరస్పరం పంచుకోవాల్సి ఉంటుందని సూచించింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన జి. గణేష్ అనే వ్యక్తి తన కుమార్తె మిస్సింగ్‌పై ౨౦౧౧లో పోలీసులను ఆశ్రయించాడు.

కుమార్తె మిస్సింగ్ కేసును పోలీసులు అన్ ఐడెంటిటీ (ఎప్పటికీ గుర్తించలేని) కేసుగా పరిగణించి మూసివేశారని, తనకు న్యాయం చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై తాజాగా జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మిస్సింగ్ పిల్లల ఆచూకీ లభించేంత వరకు దర్యాప్తు కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తేల్చిచెప్పింది.

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను ౪ వారాల్లోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పిల్లలు ఆచూకీ లభించనప్పుడు ఏమాత్రం జాగు చేయవద్దని సూచించింది. మిస్సింగ్స్ వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వస్తే, ౪ నెలల కాల పరిమితితో సంబంధం లేకుండా కేసులను సత్వ రం ప్రత్యేక విభాగాలకు బదిలీ చేయాలని ఆదేశించింది.

ప్రభుత్వ విభాగాలు కాపాడిన పిల్లల ను 24 గంటల లోపు వారి కుటుంబాలకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఆయా కుటుంబాల ప్రమేయంపై ఏమైనా అనుమానాలు వస్తే, పిల్లల సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు చూసుకోవాలని తెలిపింది.

కాపాడిన పిల్లల గుర్తింపును పక్కా గా ధ్రువీకరించేందుకు, వారికి బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు అనుసంధానం చేయాలని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ నిట్లను ఆదేశించింది. ఈ కేసును ఇంతటితో ముగించడం లేదని, ఆదేశాల అమలుపై నివేదికలనూ పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ ఆగస్టు నెలకు వాయిదావేసింది.