18 July, 2026 | 11:44 AM

Breaking News

పంద్రాగస్టుకు ఖైదీల విడుదల!

02-07-2024 12:27 AM
  • 231 మందితో జాబితా సిద్ధం

గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.. త్వరలోనే ఉత్తర్వులు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సుమారు 231 మంది జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ సైతం జాబితాకు పచ్చజెండా ఊపుతూ సంతకం చేసినట్లు సమాచారం. నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గతంలో ఏటా పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేవారు. అయితే గడిచిన పదేండ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ఖైదీలను విడుదల చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016, 2020 సంవత్సరాల్లో ఖైదీలకు ఉపశమనం కలిగింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ సిద్ధంచేసి సీఎంకు పంపించేది. సీఎం కార్యాలయం నుంచి గవర్నర్ వద్దకు వెళుతుంది. ఆ ఫైలును పరిశీలించి గవర్నర్ సంతకంతో ఖైదీలను ఈ రెండు జాతీయ పండుగల సందర్భంగా విడుదల చేసేవారు. అయితే చివరిసారిగా 2020లోనే జరిగింది. ఆ తరువాత వివిధ కారణాలతో ఖైదీల విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మొదటిసారిగా ఈ ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని వివిధ వర్గాలు, జైళ్ళలో మగ్గిపోతున్న ఖైదీల కుటుంబాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకున్నారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జైళ్ల శాఖ జాబితా పంపింది. ఈ ఫైలు పరిశీలించి దానిని గవర్నర్ ఆమోదం కోసం సీఎంవో పంపించినట్లు సమాచారం.

సోమవారం గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఖైదీల విడుదలకు సంబంధించిన ఫైలుకూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి వచ్చిన ఖైదీల విడుదలకు సంబంధించిన ఫైలును గవర్నర్ పరిశీలించి సంతకం చేసినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే, జైళ్ల శాఖ 231 మంది పేర్లు పంపినా తుది జాబితాలో ఎంతమంది ఉంటారనేది తెలియాల్సి ఉంది.