16 July, 2026 | 11:29 AM

మత మార్పిడుల ముప్పు

04-07-2024 01:11 AM
  • దేశంలో పెరిగిపోతున్న బలవంతపు మత మార్పిడులు
  • ఆందోళన వ్యక్తంచేసిన అలహాబాద్ హైకోర్టు
  • రాజ్యాంగం ఇచ్చింది మత స్వేచ్ఛను మాత్రమే
  • ప్రలోభాలతో మత మార్పిడులను కాదు

న్యూఢిల్లీ, జూలై 3: భారత్‌లో అనేక రాష్ట్రాలు మతమార్పిడుల నిషేధ చట్టాలు తెస్తూ పౌరుల మత స్వేచ్ఛను కాల రాస్తున్నాయని అమెరికా ప్రభుత్వం ఇటీవల ఆరోపించింది. అందుకు భారత ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కానీ, భారత్‌లో పరిస్థితులు మత స్వేచ్ఛకు, మత మార్పిడులకు మధ్య రగులుతున్నాయి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో భాగమైన మత స్వేచ్ఛను ఆర్టికల్ 25 వివరిస్తున్నది. ఈ ఆర్టికల్ ప్రకారం భారత పౌరులెవరైనా తాము నమ్మిన మతాన్ని స్వేచ్ఛగా అవలంభించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ, వాస్తవంలో చాలాచోట్ల అది రివర్స్‌లో జరగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

అలహాబాద్ హైకోర్టు కూడా సోమవారం ఇదే విషయాన్ని చెప్పింది. మత స్వేచ్ఛకు, మత మార్పిడికి చాలా తేడా ఉన్నదని కైలాశ్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం మత స్వేచ్ఛ మాత్రమే ఇచ్చిందని, మత మార్పిడిల స్వేచ్ఛ ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఈ మత మార్పిడులు ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు దేశంలోని మతపరమైన మెజారిటీ ప్రజలు మైనారిటీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తంచేశారు.

స్ఫృహతోనే మారుతున్నారా?

మనదేశంలో నలుమూలలా కొన్ని మతాల సంఘాలు చారిటీల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పేదలకు చదువు చెప్పటం, ఆర్థికంగా ఆదుకోవటం వంటి పనులు చేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నది కానీ, వాటి కార్యక లాపాలు అంతవరకే ఆగిపోవటం లేదు. వాటి అసలు లక్ష్యం ప్రజలను తమ మతంలోకి మార్చుకోవటమే. పేదలకు ఆహారం, ఆరోగ్యం, ఆవాసమే అతిముఖ్యమైనవి. వాటికోసమే జీవితాంతం పోరాటం చేస్తుంటారు. సరిగ్గా ఇక్కడే ఈ చారిటీ సంస్థలు కీలు పట్టుకొంటున్నాయి. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని మూకుమ్మడి మత మార్పిడులకు పాల్పడుతున్నాయి. ఒక మతంలోంచి మరో మతంలోకి మారటానికి భారత పౌరులకు స్వేచ్ఛ ఉన్నది. కానీ, అది ఆ వ్యక్తి సంపూర్ణ అవగాహనతో జరగాలి.

ఇతరులు ప్రోద్బలంతో మారకూడదు. మనదేశంలో ఇప్పుడు మతం మారుతున్నవాళ్లలో 99 శాతం పేదలు, ఎస్సీలు, ఎస్టీలే ఉంటున్నారు. సమాజంలో వారు అట్టుడుగు వర్గాలుగా ఉన్నారు. దేశంలో నిరుపేదలు కూడా వీరే. అందుకే ఈ చారిటీ సంస్థలు వారినే టార్గెట్ చేస్తున్నాయి. వారి పిల్లలకు చదువుకోసం పాఠశాలలు, వైద్యం కోసం చిన్నచిన్న దవాఖానలు ప్రారంభించి మెళ్లిగా తమ వలలో వేసుకొంటున్నాయి. దీంతో ప్రజలకు తెలియకుండానే ఇతర మతాచారంలోకి మారిపోతున్నారు. ఈ క్రమంలో ఈ చారిటీల నిర్వాహకులు చేస్తున్న బ్రెయిన్ వాష్ మామాలుగా ఉండటంలేదు. ప్రజలకు అసలు సొంత ఆలోచన అనేదే రాకుండా ఒకరకమైన ట్రాన్స్‌లోకి పంపి మతం మారేలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

తారుమారవుతున్న లెక్కలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో 1951లో నిర్వహించిన జనాభా లెక్కల్లో దేశంలో హిందువులు 85 శాతం ఉన్నారు. 60 ఏండ్ల తర్వాత అది ఆరు శాతం తగ్గిపోయింది. ఇతర మతాల జనాభా మాత్రం భారీగా పెరిగింది. ప్రస్తుతం అత్యధిక జనాభాలో భారత్‌దే మొదటిస్థానం. చైనాను చాలాకాలం క్రితమే దాటేశాం. దాదాపు 140 కోట్ల జనాభాతో భారత్ నిండుకుండలా ఉన్నది. అయితే, ఇంత జనాభాలో ఎక్కడ ఏం జరుగుతున్నది? ఎవరు ఏ మతంలోకి మారుతున్నారు? అనే విషయాన్ని ప్రభుత్వాలు దాదాపు పట్టించుకోవటమే మానేశాయి. దశాబ్దాలుగా ఇదే కొనసాగింది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బలవంతపు మత మార్పిడులపై దృష్టి పెట్టింది.

చాలా రాష్ట్రాలు మత మార్పిడి నిషేధ చట్టాలు చేస్తున్నాయి. ఈ చట్టాలను చాలా రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కూడా. దీంతో దేశంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకున్నది. ఎవరు చెప్తున్నది నిజమో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అసలు మత స్వేచ్ఛపై రాజ్యాంగం ఏం చెప్తున్నది అన్న విషయాన్ని మేధావులు కూడా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పటం లేదు. అందుకే ఈ సమస్య మరింత జఠిలమవుతున్నది.