ఆ ఖైదీలను వదిలిపెట్టండి
అండర్ ట్రయల్ ఖైదీలకు శుభవార్త చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ, ఆగస్టు 24: చిన్నచిన్న నేరాలకు కూడా జైళ్లలో నెలలు, ఏండ్లతరబడి మగ్గిపోతున్న అండర్‌ట్రయల్ ఖైదీలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మొదటిసారి నేరాలు చేసి అండర్‌ట్రయల్ ఖైదీలుగా ఉన్నవారు తమకు పడే శిక్షలో మూడోవంతు జైల్లో గడిపినట్టయితే వెంటనే వారికి బెయిల్ ఇవ్వాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 479 దేశం మొత్తానికీ వర్తిస్తుందని ప్రకటించింది.
ఈ సెక్షన్ ప్రకారం మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే సెక్షన్ల కింద కేసులున్నవారు మినహా మిగతా అండర్ ట్రయల్ ఖైదీలు తమకు వాస్తవంగా పడే శిక్షలో మూడోవంతు కాలం జైల్లో గడిపితే వారికి బెయిల్ ఇవ్వవచ్చు. ‘సెక్షన్ 479ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని దేశంలోని అన్ని జైళ్ల సూపరిం టెండెంట్లను ఆదేశిస్తున్నాం. దీని ప్రకారం జైళ్లలో ఉన్న అండర్‌ట్రయల్ ఖైదీలు పెట్టుకొన్న బెయిల్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి. ఎలాంటి ఆలస్యం లేకుండా మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి’ అని ధర్మాసనం ఆదేశించింది.






