ఘోష్‌పై అవినీతి కేసు
- కోల్‌కతా నిందితులకు పాలీగ్రాఫ్ పరీక్షలు
- వైద్యురాలి హత్యకేసులో కీలక పరిణామాలు
కోల్‌కతా, ఆగస్టు 24: కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఆర్జీ కర్ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ అవినీతి ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. మరోవైపు ఈ కేసులో అరెస్టు చేసిన ఆరుగురు నిందితులకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో సందీప్ ఘోష్ కూడా ఉన్నారు.
88 గంటల విచారణ
డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దర్యాప్తు జరిపేందుకు బెంగాల్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలను తీసుకొన్న సీబీఐ సందీప్ ఘోష్‌ను 88 గంటలపాటు ప్రశ్నించింది. కాలేజీలోని సీసీ ఫుటేజీ సహా అన్ని ఆధారాలను సీబీఐకి సిట్ బదిలీ చేసింది. దీంతో సీబీఐ అధికారులు ఘటన జరిగిన ఆగస్టు 9న అసలు ఏం జరిగిందన్న అంశంపై లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌తోపాటు సందీప్ ఘోష్ మరో ముగ్గురు వ్యక్తులకు శనివారం పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా విచారణ జరుపుతున్నది.
సందీప్ అవినీతిపై ఫోకస్
కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆర్జీ కర్ దవాఖానలో మొన్నటి వరకు ఎదురు లేకుండా చక్రం తిప్పారు. ఆయనపై మొదటి నుంచీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2022లోనే కాలేజీ మాజీ డిఫ్యూటీ సూపరింటెండెంట్ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా సందీప్ ఘోష్ అవినీతిపై విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించటంతో దీంతో శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. సందీప్ అక్రమాలను వెలికి తీసే పనిలో పడింది.






