22 August, 2026 | 7:00 PM

నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం..!

22-08-2026 05:55 PM

బోధన్, ఆగస్టు 22  (విజయ క్రాంతి): నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కలకలం రేపింది. జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చిన ఖైదీ ఒక్కసారిగా ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి కిందికి దూకినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. జైలులో ఉన్న ముగ్గురు రిమాండ్ ఖైదీలను శనివారం పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యుల వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వారిలో ఓ ఖైదీ పోలీసుల పర్యవేక్షణ నుంచి తప్పించుకుని ఆసుపత్రి రెండో అంతస్తు వైపు వెళ్లినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి కిందికి దూకినట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఖైదీని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అతడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఖైదీ ఏ కేసులో రిమాండ్‌లో ఉన్నాడు..? ఆత్మహత్యాయత్నానికి గల కారణాలేమిటి..? ఆసుపత్రి రెండో అంతస్తుకు ఖైదీ ఎలా చేరుకున్నాడు..? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి..? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఖైదీ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.