ఈఎస్‌ఐకి అద్దె గండం!
- ఖాళీ ప్రభుత్వ భవనాల్లో డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
- ప్రతి నెలా అద్దె వసూలుకు ప్రయత్నాలు ?
- చదరపు అడుగుకు రూ.40 నుంచి రూ.60 వరకు..
- ఉచితంగా కేటాయించాలంటున్న ఈఎస్‌ఐ ఉద్యోగ వర్గాలు
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల ద్వారా ఆదాయం సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా వా టిని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు అప్పగించి అద్దె వసూలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా కలిసి ఉన్న డిస్పెన్సరీలను సైతం విడదీసి వేర్వేరుగా ఏర్పాటు చేయాలని, అందుకు తగిన ప్రభుత్వ భవనాలను చూసుకోవాలంటూ ఇప్పటికే అధికా రులు అల్టిమేటం ఇచ్చారు.
ఆ రెండు డిస్పెన్సరీలకు ఉచితంగా..
సనత్‌నగర్ 1, 2 డిస్పెన్సరీలకు మాత్రం అద్దె లేకుండానే ప్రభుత్వ భవనాన్ని కేటాయించడం గమనార్హం. కేపీహెచ్‌బీ ఫేజ్h లోని వసంతనగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ మోడల్ మార్కెట్ భవనాన్ని సనత్‌నగర్ డిస్పెన్సరీలకు ఉచితంగా ఇవ్వాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయిం చింది. వచ్చే మూడేళ్ల వరకు ఎలాంటి అద్దె లేకుండా భవనాన్ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మిగతా వాటికి అద్దె ఎందుకో?
సనత్‌నగర్ 1,2 డిస్పెన్సరీలకు ఉచితంగా ప్రభుత్వ భవనాన్ని కేటాయించిన అధికారులు.. మిగతా వాటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించడం వెనుక అంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని కూడా అద్దె లేకుండానే ఇవ్వొచ్చన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరుద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ప్రతి నెలా తమ వేతనంలో నుంచి చెల్లిస్తున్న కొంత మొత్తం తో ఈఎస్‌ఐను నెట్టుకొస్తున్నారు.
వారికి చేయూతనిద్దామన్న ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టుగా కనపడటం లేదు. అందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 ప్రాంతాల్లో 635 దుకాణాలతో కూడిన ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో 26 డిస్పెన్సరీలను విడదీసి ఎవరికివారుగా డిస్పెన్సరీలను ఏర్పా టు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు.
అలాగే ఇప్పటి వరకు ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో కొనసాగుతున్న మరో ఏడు డిస్పెన్సరీలను కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చుకోవాలని అధికారులు ఆదేశించారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలంటూ తేల్చి చెప్పారు. మొత్తంగా డిస్పెన్సరీలకు ప్రభుత్వ భవనాల కేటాయింపు పేరుతో భారీగా అద్దె వసూలు చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆరోపణలున్నాయి.
సౌకర్యాలు అంతంతమాత్రంగానే..
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో చాలా వరకు సరైన సౌకర్యాలు లేవు. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు మెట్లు, టాయిలెట్లు లేవు. నీళ్లు రావు. తలుపులు, కిటీకీలు అరకొర.. గదులు సరిగ్గా లేవు. అయినప్పటిక ఒక్కో చదరపు అడుగుకు రూ.40 నుంచి రూ.60 చొప్పున వసూలు చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు ఈఎస్‌ఐ ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఒక్కో డిస్పెన్సరీ నుంచి కనీసం 1.25లక్షలకు తగ్గకుండా అద్దె వసూలు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్ల్లు తెలుస్తోంది.






