రిపోర్టర్ సాక్షి!
‘జిప్సీ’, ‘మేరే సోహ్నే సోనియా’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచుకున్న ముంబయి ముద్దుగుమ్మ నటాషా సింగ్. ఈ భామ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రస్తుతం నటిస్తున్న తాజాచిత్రం ‘హిట్ అండ్ రన్’. సాయికృష్ణ సాగర్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సతీశ్‌రెడ్డి అల్లం ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీశ్‌రెడ్డి అల్లం, కే శేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నటాషా ఇందులో సంజయ్ రావ్ సరసన నటిస్తోంది.
నటాషా పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ సినిమాలో నటాషా ‘రిపోర్టర్ సాక్షి’ అనే ఒక పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సంజయ్‌రావ్, నటాషా ముఖ్యపాత్రలు పోషిస్తుండగా కిరీటి, మురళీధర్‌గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవిప్రకాశ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తుండగా, విజయ్‌భాస్కర్ సద్దాల, ఎల్ గంగాధర్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే టీజర్, విడుదల తేదీ వంటి మరిన్ని అప్డేట్స్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలావుంటే, నటాషా సింగ్.. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హై లెస్సో’ చిత్రంలోనూ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది.






