13 June, 2026 | 1:46 AM

రావు బహదూర్ తెలుగువారు గర్వపడే చిత్రం

13-06-2026 12:00 AM

విలక్షణ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాక కథ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏ+ఎస్ మూ వీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా.. మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్,  వెంకటేశ్ మహా సమర్పిస్తున్నారు. ఇందులో దీపా థామస్ కథానాయిక కాగా.. వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ చిత్ర నిర్మాతలు ‘నాట్ ఎ టీజర్’ను లాంచ్ చేశారు.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “క్రేజీ సినిమా ఏ ఇండస్ట్రీలో వచ్చినా తెలు గు ప్రేక్షకులు ఆదరిస్తారు. జూలై 3న మా ‘రావు బహదూర్’ కూడా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని మిగతా ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా అంతే స్థాయిలో ఆదరిస్తారని నమ్ముతున్నా. తెలుగులో ఒక క్రేజీ ఫిల్మ్ వచ్చిందని గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉం టుంది. విదేశాల్లో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల గురించి చెప్పుకున్నంత గొప్పగా ఈ సినిమా గురించీ అంతే గొప్పగా చెప్పుకుంటారు.

తెలుగు ప్రేక్షకులందరూ గర్వప డేలా ఈ సినిమాను చేశాం” అని తెలిపారు. ‘ఇంత గొప్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం గర్వంగా, ఆనందంగా ఉంద’ని హీరోయిన్ దీపా థామస్ చెప్పారు. డైరెక్టర్ వెంకటేశ్ మహా మాట్లాడుతూ.. “ఈ సినిమా నా జీవితంలో ఐదున్నర సంవత్సరాలు తీసుకుంది. ఇది నా కెరీర్‌లో, తెలుగు ఇండస్ట్రీలో చాలా ప్రత్యేక చిత్రం అవుతుందని నమ్ముతున్నా” అన్నారు. నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ.. “ఈ సినిమా కథపై ఇండస్ట్రీలో చాలామందికి ఆసక్తి ఉంది.

కానీ ఇంత భారీ స్థాయిలో ఈ సినిమాను ఎలా చేస్తారని అనుకున్నారు. ఈ సినిమా మా పేరుపై రాసిపెట్టి ఉందని భావిస్తున్నాం. ఈ సినిమా అందరినీ ఆలోచింపజేస్తుంది. ప్రేక్షకులే దీన్ని ముందుకు తీసుకెళ్తారు” అన్నారు. నిర్మాత అనురాగ్‌రెడ్డి మాట్లాడుతూ.. “రావు బహదూర్ జూలై 3న విడుదల కానుంది. ఆ శుక్రవారం మిగతా శుక్రవారాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది” అని చెప్పారు. ‘రావు బహదూర్ లాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంటుంది’ అని నిర్మాత గోపాల కృష్ణ రెడ్డి తెలిపారు. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.