calender_icon.png 8 February, 2026 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిగ్ వర్కర్ల సమ్మె

08-02-2026 12:44:05 AM

దేశవ్యాప్తంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసనలు

సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి లేఖ

ప్రత్యేక చట్టం తేవాలని లోక్‌సభలో రాహుల్‌గాంధీకి వినతి

డిమాండ్లు నెరవేర్చకపోతే మార్చి 22, 23న మళ్లీ సమ్మె

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర ప్లాట్‌ఫామ్‌లలో పనిచేస్తున్న బైకులు, ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు కనీస చార్జీలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని, ప్రైవేటు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడడాన్ని నిరో ధించాలని గిగ్‌కార్మికులు, యూనియన్ల నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), ఇతర జాతీయ కార్మిక సంఘా లతో కలిసి శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేశాయి.

డ్రైవర్లు తమ రైడ్-హెయిలింగ్ యాప్‌లను ‘ఆల్ ఇండియా బ్రేక్డౌన్’ చేశారు. దీంతో దీన్ని ప్రభావం ఓలా, ఉబెర్, ర్యాపిడో సేవలపై అధికంగా ఆధారపడిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలపై కన్పించింది. సమ్మె ఆరు గంటల పాటు కొనసాగిందని, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసన చేశామని యూనియన్ల నేతలు పేర్కొన్నారు. అనేక కార్మిక సం ఘాలు కనీస బేస్ ఛార్జీని డిమాండ్ చేశాయి. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో, దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత రవా ణా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. 

ఓలా, ఉబర్, రాపిడో, పోర్టర్ ఆటోలు, క్యాబ్ లు, బైక్ టాక్సీలను నిర్వహించే ఇతర అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే రైడర్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల వ్యవస్థలు లేనందున, కంపెనీలు స్వయంగా ఛార్జీలను నిర్ణయిస్తున్నాయని, దీంతో కార్మికులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి.

మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు, 2025 ప్రకారం కనీస బేస్ ఛార్జీలను తెలియజేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫల మయ్యాయని యూనియన్లు ఆగ్రహించాయి. ఆ మార్గదర్శకాలను పట్టించుకోకుండా అగ్రిగేటర్ కంపెనీలు ఏకపక్షంగా ఛార్జీలను నిర్ణయి స్తూనే ఉన్నాయని, కార్మికులను అస్థిరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయని, తగ్గుతున్న ఆదాయాల కోసం కార్మికులు ఎక్కువ గంటలు పనిచేసేలా బలవంతం చేస్తున్నాయని యూనియన్ల నేతలు ఆరోపించారు.

టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ) సహ వ్యవస్థాపకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ, ప్రభుత్వం నోటిఫై చేసిన బేస్ ఛార్జీలు లేకపోవడం వల్ల ప్లాట్‌ఫామ్ కంపెనీలు ధరలను ఏకపక్షంగా తగ్గించి, వాటి నష్టాలను కార్మికుల నుంచి పిండుకునేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీని కలిసిన గిగ్ కార్మికుల బృందం

ఓలా, ఉబెర్, ర్యాపిడో రవాణా, డెలివరీ గిగ్ కార్మికుల ప్రతినిధి బృందం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. కేంద్రం నుంచి చట్టం అవసరమని, ఈ చట్టాన్ని తీసుకొచ్చి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడంపై చర్చించామని టీజీపీడబ్ల్యూయూ, ఐఎఫ్‌ఏటీ అధ్యక్షుడు షేక్ సలావు ద్దీన్ తెలిపారు. అరగంట పాటు జరిగిన సమావేశంలో గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రతినిధి బృందం వివరించిందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ మాట వినకపోతే, తమ డిమాండ్లు నెరవేరకపోతే మార్చి 22, 23 తేదీల్లో పెద్ద దేశవ్యాప్తంగా నిరసన చేపడతామని జాతీయ డ్రైవర్ మోర్చా సమితి హెచ్చరించింది. ‘దేశంలోని దాదాపు 6,300 సంస్థలు ఈ సమ్మెలో పాల్గొన్నాయని నేషనల్ డ్రైవర్ మోర్చా సమితికి చెందిన ఒకరు తెలిపారు. ఈ సమ్మెలో రాష్ట్రీయ డ్రైవర్ సంయుక్త మోర్చా సమితి, ఆల్ ఢిల్లీ ఆటో టాక్సీ కాంగ్రెస్ యూనియన్ బ్యానర్ కింద అనేక టాక్సీ డ్రైవర్ల సంఘాలు, టీజీపీడబ్ల్యూ యూ, ఐఎఫ్‌ఏటీ యూనియన్లు నిరసనలో పాల్గొన్నాయి.