స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలి
మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్ కృష్ణయ్య చర్చ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : రాష్ట్రంలో తక్షణమే కుల గణన చేపట్టి, పంచాయితీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో రిజర్వేషన్లను 20 నుంచి 40 శాతానికి పెంచాలన్నారు.
బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, గోరిగె మల్లేష్ యాదవ్, నీలం వెంకటేష్, రామకృష్ణ, అనంతయ్య, వంశీకృష్ణ, కృష్ణమూర్తి, ఉదయ్ నేత, శివకృష్ణ ముదిరాజ్, బలరామ్ నాయక్, పర్వతాలు తదితర బీసీ నేతలతో కలిసి ఆర్. కృష్ణయ్య బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో శుక్రవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కుల గణన తర్వాత బీహార్‌లో 60 శాతం, తమిళనాడులో 70 శాతం బీసీ రిజర్వేషన్లను పెంచినట్టు గుర్తు చేశారు. 50 శాతం సీలింగ్ తొలగించి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ల ఏర్పాటును సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్టు తెలిపారు.
ప్రైవేటు యూనివర్శిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టాల న్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ కళాశాల కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజులు చెల్లించే స్కీము పునరుద్దర ణ జరగాలన్నారు. విదేశీ విద్య స్కీమ్‌కు రూ. 60 నుంచి రూ.300 కోట్లు, బీసీ స్టడి సర్కిల్‌కు రూ. 200 కోట్లు కేటాయించాలన్నారు. అర్హులైన వారికి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచు తామని, ఫీజు బకాయిలు చెల్లించేలా ప్రతి నెలా గ్రీన్ చానల్ లో ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చినట్టుగా ఆర్. కృష్ణయ్య తెలిపారు.
ఈవీఎంలో లోపాల వల్లే జగన్ ఓటమి
ఏపీ ఎన్నికల్లో ఈవిఎంలలో లోపాలు కారణంగానే జగన్ ఓటమి చెందారని, ఎక్కడ ఏ తప్పు జరిగిందో లోతైనా విశ్లేషణ జరుగుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో వైస్ జగన్ ప్రభుత్వం ఓటమి చెందడంపై ఆర్. కృష్ణయ్య శుక్రవారం సెక్రటేరియట్ వద్ద మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. జగన్‌ను ప్రజలు వద్దనుకోలే దన్నారు. జగన్ అహంకారంతో ఓడిపోలేదని అన్నారు. ప్రజలంతా జగన్‌కే ఓటు వేస్తున్నామని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఏపి అభివృద్దిపై కొత్త ప్రభుత్వం ఏమి చేస్తందనే విషయంపై ఇప్పడే స్పందించలేనని ఆర్. కృష్ణయ్య అన్నారు.






