19 June, 2026 | 5:42 PM

మండల ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

19-06-2026 04:12 PM

అనుమానిత లింక్‌లు ఓపెన్ చేయవద్దు: సీఐ  రాజు వర్మ హెచ్చరిక

చర్ల,(విజయక్రాంతి): రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చర్ల సీఐ  రాజు వర్మ పిలుపునిచ్చారు.  మొబైల్ ఫోన్‌లకు వస్తున్న _అన్నోన్ _ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. ఒక క్లిక్‌తో బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

ఇటీవల కాలంలో యువత ఈజీ మనీ మోజులో పడి ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ యాప్‌ల వెనుక సైబర్ నేరగాళ్లు ఉండి, వ్యక్తిగత డేటా దొంగిలించి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించి, పిల్లల ఫోన్ వినియోగాన్ని గమనించాలని కోరారు.

  మండల పరిధిలో మైనర్ పిల్లలకు ఎవరైనా వాహనాలు ఇచ్చినట్లు గుర్తిస్తే, వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుని తప్పకుండా కేసు నమోదు చేస్తామని సి ఐ  రాజు వర్మ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.