తాగునీటి సమస్యలను పరిష్కరించండి
- గ్రామాల్లో సర్పంచ్‌ల అభిప్రాయమే మార్గదర్శకం
- మిషన్ భగీరథ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
- సర్పంచ్‌ల అభిప్రాయాలు సేకరించిన ఈఎన్సీ కార్యాలయం
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): గ్రామస్థాయిలో సర్పంచ్‌ల అభిప్రాయమే ప్రభుత్వానికి అసలైన మార్గదర్శకమని, వారి సూచనల ఆధారంగా మిషన్ భగీరథ సేవలను మరింత మెరుగు పరుస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజినీర్-ఇన్-చీఫ్ కార్యా లయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులతో నేరు గా అనుసంధానం చేపట్టి తాగునీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర అభిప్రాయాల సేకరణ కార్యక్రమం నిర్వ హించారు. గత పది రోజులుగా ఫోన్ ద్వారా సర్పంచ్‌లతో సంప్రదింపులు జరిపి, మొత్తం 12,728 గ్రామ పంచాయతీలలో 12,457 మంది సర్పంచ్‌ల అభిప్రాయాలను సేకరించారు.
తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లోరినేషన్, ట్యాంకుల శుభ్రత, పైప్‌లైన్ లీకేజీలు, పంపుల పనితీరు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు, టోల్ ఫ్రీ నంబర్ 1916పై అవగాహన తదితర 16 కీలక అంశాలపై వివరాలు సేకరించారు. దీనిపై మంత్రి సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్పం చ్‌ల అభిప్రాయ సేకరణ వివరాలను తెలుసుకున్నా రు. ఈ అభిప్రాయ సేకరణలో అధిక శాతం సర్పంచ్‌లు తాగునీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేయడం పై మంత్రి సీతక్క హర్షం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్పంచ్‌లు గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకు వెళ్లి పరిశీలించి, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుంచి 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ వ్యవస్థ లేని మారుమూల గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు ఓపెన్ వెల్స్ తవ్వించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా వర్షాకాలానికి ముందే చెక్‌డ్యాంలు నిర్మించాలని సూచించారు.
స్థానిక నీటి వనరులను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా నీటి లభ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. తాగునీటి సమస్యలపై ఎవరైనా టోల్ ఫ్రీ నంబర్ 1916కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
గత వేసవిలో ఎలాంటి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నట్టే, ఈసారి కూడా మిషన్ భగీరథ ఇంజినీర్లు నిరంతర పర్యవేక్షణతో పనిచేయాలని స్పష్టంచేశారు. సమస్యాత్మక గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడా లు, లంబాడీ తండాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దిశానిర్దేశంచేశారు. వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో తాగునీటి సరఫరాపై వచ్చే ప్రతి సమాచా రం పట్ల వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.




