ఏడాది కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ, జూన్ 12: ఈ ఏడాది మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠస్థాయి 4.75 శాతానికి తగ్గింది. కేంద్ర గణాంకాల శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్‌లో వినిమయ ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతంకాగా, 2023 మే నెలలో 4.31 శాతంగా ఉన్నది. 2024 ఫిబ్రవరిలో 5.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అప్పటినుంచి క్రమేపీ తగ్గుతున్నది. సీపీఐలోని ఫుడ్ బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం మే నెలలో ఏప్రిల్‌తో పోలిస్తే స్వల్పంగా 8.70 శాతం నుంచి 8.69 శాతానికి దిగింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి అదుపు చేయాలని రిజర్వ్‌బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.5 శాతం మేర ఉంటుందని ఇటీవల ఆర్బీఐ అంచనాల్లో ప్రకటించింది. క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున నమోదవుతుందని అంచనా వేసింది.
జూలైలో 3 శాతానికి తగ్గుదల: ఇక్రా అంచనా మే నెలలో ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్ఠస్థాయి 4.75 శాతానికి అనూహ్యంగా తగ్గిందని, తదుపరి నెలల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఫ్యూయల్, లైట్ విభాగాలు మినహా అన్ని సబ్‌గ్రూప్‌ల్లోనూ ద్రవ్యోల్బణం తగ్గడం లేదా స్థిరంగా ఉన్నదని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అతిది నాయర్ చెప్పారు. 2024 జూన్‌లో ఆహార, పానీయాల ద్రవ్యోల్బణం మరికొత్త తగ్గుతుందని, అయితే 7 శాతం ఎగువనే ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. ఈ ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా 2024 జూన్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 5 శాతంలోపునే ఉంటుందని, జూలై, ఆగస్టు నెలల్లో తాత్కాలికంగా 2.5 శాతానికి దిగివస్తుందని నాయర్ వివరించారు. తాజా ఎన్‌ఎస్‌వో గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.15 శాతంకాగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.28 శాతం ఉన్నది. రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, చత్తీస్‌ఘర్, హర్యానా, కర్నాటక, కేరళ, ఒడిస్సా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ల్లో జాతీయ స్థాయి 4.75 శాతంకంటే అధికంగా ఉన్నది.






