మూడు నెలల కనిష్ఠానికి పారిశ్రామికం
న్యూఢిల్లీ, జూన్ 12: తయారీ రంగం మందగించడంతో భారత్ పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. 2024 ఏప్రిల్ నెలలో దేశ పారిశ్రా మికోత్పత్తి సూచి (ఐఐపీ) వృద్ధి రేటు 5 శాతానికి తగ్గింది. మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి పనితీరును కనపర్చినప్పటికీ, తయారీ రంగం పనితీరు పేలవంగా ఉన్నదని బుధవారం కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో ఐఐపీ వృద్ధి 5.4 శాతం, ఫిబ్రవరిలో 5.6 శాతంగా ఉన్నది. 2024 జనవరిలో నమోదైన 4.2 శాతం వృద్ధి రేటు తర్వాత ఏప్రిల్‌నెలలోనే అంతక్రితం రెండు నెలలతో పోలిస్తే తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పారిశ్రామిక రంగం వృద్ధి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 5.2 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. 2023 ఏప్రిల్ నెలలో ఈ వృద్ధి రేటు 4.6 శాతంగా ఉన్నది.
3.9% తగ్గిన తయారీ రంగం వృద్ధి
తయారీ రంగం వృద్ధి రేటు 2024 ఏప్రిల్ నెలలో 3.9 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రంగం 5.5 శాతం వృద్ధిచెందింది. ఈ ఏప్రిల్‌లో మైనింగ్ రంగం ఉత్పత్తి 6.7 శాతం వృద్ధిచెందింది. నిరుడు ఇదే నెలలో ఇది 5.1 శాతం ఉన్నది. తాజా సమీక్షా నెలలో విద్యుదుత్పత్తి 10.2 శాతం వృద్ధిచెందగా, ఏడాది క్రితం ఇది 1.1 శాతమే. యూజ్‌బేస్ వర్గీకరణ ప్రకారం క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గగా, కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి భారీగా 9.8 శాతం వృద్ధిచెందింది. 2023 ఏప్రిల్‌లో ఇది 2.3 శాతం క్షీణించింది. కన్జూమర్ నాన్‌రౌ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.4 శాతం తగ్గగా, నిరుడు ఏప్రిల్‌లో 11.4 శాతం పెరిగింది. ఇన్‌ఫ్రా/కన్‌స్ట్రక్షన్ గూడ్స్ వృద్ధి రేటు 13.4 శాతం నుంచి 8 శాతానికి తగ్గింది. ప్రైమరీ గూడ్స్ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్‌లో 7 శాతం వృద్ధిచెందగా, గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి 1.9 శాతానికే పరిమితమయ్యింది.






