23 June, 2026 | 1:22 PM

వచ్చే మూడేండ్లలో ఇండియాదే జోరు

12-06-2024 12:30 AM

6.7 శాతం వృద్ధి  n  ప్రపంచ బ్యాంక్ అంచనా

న్యూఢిల్లీ, జూన్ 11: వచ్చే మూడేండ్లలో కూడా ఇండియా ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా రానున్న మూడేండ్లూ భారత్ 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని మంగళవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధిచెందిందని, జనవరిలో ప్రకటించిన అంచనాలకన్నా 1.9 శాతం అధికంగా వృద్ధి సాధించిందని వరల్డ్ బ్యాంక్ తన తాజా గ్లోబల్ ఎకనామిక్ ప్రాసెక్ట్స్ రిపోర్ట్‌లో పేర్కొంది.

‘ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా ఇండియా వేగవంతమైన వృద్ధి కొనసాగుతుంది. 2023 అధిక బేస్ కారణంగా వృద్ధి వేగం కాస్త నెమ్మదించినా, 2024 నుంచి వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున 6.7 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుంది’ అంటూ ప్రపంచ బ్యాంక్ నివేదికలో వివరించింది. హయ్యర్ బేస్ నుంచి పెట్టుబడులు నెమ్మదించడం వృద్ధి జోరు మందగించడానికి కారణమని తెలిపింది.

అయితే పెట్టుబడుల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, ప్రభుత్వ పెట్టుబడులకు ప్రైవేటు పెట్టుబడులు తోడవుతాయన్నది. వ్యవసాయ దిగుబడి కోలుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గడంవల్ల ప్రైవేటు వినియోగం పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రభుత్వ వినియోగం మాత్రం నెమ్మదిగా వృద్ధిచెందుతుందని, జీడీపీలో వ్యయాల శాతాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నందున ఈ వృద్ధి మందకొడిగా ఉంటుందని పేర్కొంది. భారత్‌లో ద్రవ్యోల్బణం రిజర్వ్‌బ్యాంక్ నిర్దేశిత శ్రేణి 2 శాతం మధ్యలోనే 2023 సెప్టెంబర్ నుంచి ఉంటున్నదని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 

ప్రపంచ ఆర్థికాభివృద్ధి 2.6 శాతం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024లో స్థిరంగా 2.6 శాతం వృద్ధి సాధిస్తుందని, 2025, 2026 సంవత్సరాల్లో ఇది సగటున 2.7 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ అంచనా వేసింది. ఇది కొవిడ్ ముందస్తు స్థాయి 3.1 శాతానికంటే తక్కువే. కొవిడ్ 2019కు ముందు దశాబ్దంలో సాధించిన వృద్ధికంటే ప్రపంచ జీడీపీ ఇంకా మందకొడిగానే ఉన్నదని వివరించింది. 2023లో 6.6 శాతం వృద్ధిచెందిన దక్షిణాసియా ప్రాంతం వృద్ధి 2024లో 6.2 శాతానికి తగ్గుతుందని, హయ్యర్ బేస్ నుంచి భారత్ వృద్ధి నెమ్మదించడమే ఇందుకు కారణమని ప్రపంచ బ్యాంక్ వివరించిది.  ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థలో బంగ్లాదేశ్ వృద్ధి గత పలు ఏండ్లతో పోలిస్తే నెమ్మదించినప్పటికీ జోరుగానే ఉంటుందని, పాకిస్థాన్, శ్రీలంక ఆర్థిక వ్యవస్థలు పటిష్టపడతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 

గరిష్ఠస్థాయిలోనే వడ్డీ రేట్లు

పాలసీ వడ్డీ రేట్ల తగ్గింపుపై పలు దేశాల కేంద్ర బ్యాంక్‌లు జాగురూకతతో వ్యవహరిస్తున్నందున, అంతర్జాతీయ వడ్డీ రేట్లు గరిష్ఠస్థాయలోనే కొనసాగుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇటీవలి దశాబ్దాల్లో ఇవే అధిక వడ్డీ రేట్లని తెలిపింది. 2000 సంవత్సరాల గ్లోబల్ వడ్డీ రేట్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపుగా ఉన్నాయని, 2025 సగటు వడ్డీ రేట్లు 4 శాతం ఉండవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం 2024లో 3.5 శాతానికి, 2025లో 2.9 శాతానికి తగ్గుతుందని, అయితే ఈ తగ్గుదల వేగం ఆరు నెలలక్రితం వేసిన అంచనాలకంటే తక్కువే ఉంటుందని తెలిపింది.