పార్వతి బ్యారేజీని పరిశీలించిన విచారణ కమిటీ కమిషనర్
పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి బ్యారేజీని విచారణ కమిటీ కమిషనర్ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం వద్ద ఉన్న పార్వతి(సుందిళ్ళ) బ్యారేజ్ కి కాన్వాయ్ ద్వారా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి చంద్ర ఘోష్ బృందం చేరుకొని సందర్శించారు. పార్వతి బ్యారేజ్ పై నుండి కింద భాగాన్ని జడ్జి చంద్ర ఘోష్ వీక్షించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తర్వాత బ్యారేజ్ కింది భాగానికి కాన్వాయ్ ద్వారా దిగిన జడ్జి చంద్ర ఘోష్ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న లోపాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడుగడుగునా క్షుణ్ణంగా పరిశీలించి గతంలో జరిగిన లోపాలు ఉన్న వాటికి, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతు పనులకు సంబంధించి సోమవారం వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. బ్యారేజీ సందర్శనకు ముందు రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో ఉన్న అతి ప్రాచీనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జస్టిస్ చంద్రబోస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.







