హైదరాబాద్ మెట్రో రైల్ పేరుతో రేవంత్ రెడ్డి - కిషన్ రెడ్డి డ్రామాలు
30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపైన రేవంత్ రెడ్డి కన్ను
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) పేరుతో రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మాట్లాడుతూ.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల ఆస్తులను కుటుంబసభ్యులు, అనుచరులకు అప్పజెప్పే స్కామ్ చేస్తున్నారని విమర్శించారు.
ఎల్ అండ్ టీ అధికారులను(L&T officials) బ్లాక్ మెయిల్ చేసి తెలంగాణ రాష్ట్రం(Telangana State) నుంచి తరిమేశారని పేర్కొన్నారు. రూ. 14 వేల కోట్ల ఎల్ అండ్ టీ అప్పును రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారని వివరించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణను బీజేపీ(Bharatiya Janata Party) ఎందుకు ఆమోదించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కలిసి ప్రజల దృష్టి ఆకర్షించే విఫల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో రద్దు చేసిన రేవంత్ రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి తుగ్లక్, హిట్లర్ ఆదర్శమని కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.






