బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డికి దమ్ముంటే పొంగులేటిని బర్తరఫ్ చేయాలి
మంత్రి పొంగులేటిపై గవర్నర్ కు ఫిర్యాదు
హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్, భూకబ్జాల పైన విచారణ చేపట్టాలని భారత్ రాష్ట్ర సమితి శాసనసభ పక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాని కలిశారు. లోక్ భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంటకు పైగా సమావేశమైన బీఆర్ఎస్ నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్‌ను, అరాచక భూకబ్జాలను గవర్నర్‌కు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) పేర్కొన్నారు. సీఐడీని అడ్డుపెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నియంతృత్వ పోకడలతో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారని తెలిపారు.
ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతి చేస్తున్నారని గవర్నర్ కు నివేదించామని కేటీఆర్ వెల్లడించారు. ప్రజా సంపద దోపిడీని అడ్డుకోవాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. ప్రజాక్షేత్రంలో పభుత్వ పెద్దల అవినీతిని ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు అంబాసిడర్ అన్నారు. ఏ విచారణ చేయదలచకుంటే ఆ విచారణ చేసుకోండి.. ప్రభుత్వం మీది.. ఏ విచారణ అయినా చేసుకోండి, కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాశాం.. చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు.




