11 August, 2026 | 6:27 PM

రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి

11-08-2026 05:29 PM

తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

దేవాదుల నీటి నిర్వహణపై సమీక్షలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి,(విజయ క్రాంతి): ములుగు జిల్లా రామప్ప సరస్సు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా గణప సముద్రం సరస్సుకు నీటిని తరలించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.  దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణ, నీటి లభ్యత, పంపుహౌస్‌ల పనితీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం హన్మకొండ జిల్లా చింతగట్టులోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తగినంత వర్షపాతం లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని రామప్ప చెరువు నుంచి వయా వంగపెల్లి వాని చెరువు ద్వారా గణపసముద్రం చెరువుకు నీటిని విడుదల చేసి నింపాలని సూచించారు. గణపసముద్రం చెరువులో నీటి నిల్వ ఉంటే భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలకు తాగునీటి సమస్య ఉండదన్నారు.

అలాగే పరకాల చలివాగులో నీటి నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. రామప్ప నుంచి నీటిని విడుదల చేస్తే మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సూచించారు. ఎమ్మెల్యే సూచనలకు స్పందించిన ఇరిగేషన్ అధికారులు గణపసముద్రం చెరువులో 25 అడుగులు, పరకాల చలివాగులో 17 అడుగుల నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు  కడియం శ్రీహరి, కె.ఆర్ నాగరాజు, యశస్విని రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.