11 August, 2026 | 7:22 PM

కలంపై కేసులా..? ప్రశ్నిస్తే ప్రతీకారమా..!

11-08-2026 06:19 PM

ఫిర్యాదులకు రాజకీయ రంగు పులమడంపై ఐక్య నిరసన

తహసీల్దార్‌, డీఎస్పీకి వినతిపత్రాలు

అశ్వాపురం,(విజయక్రాంతి): విలేకరులపై ఫిర్యాదులు చేస్తూ వారి వృత్తికి రాజకీయ రంగు పులమడాన్ని నిరసిస్తూ అశ్వాపురం మండలానికి చెందిన జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు మంగళవారం ఐక్యంగా నిరసన చేపట్టారు. నెల్లిపాక సొసైటీ చైర్మన్‌ తుక్కాని మధుసూదన్‌రెడ్డి ఇద్దరు విలేకరులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు జర్నలిస్టులు తెలిపారు. ఫిర్యాదు విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐతో మాట్లాడిన ఇతర విలేకరులందరినీ రాజకీయ కోణంలోకి లాగడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కక్షసాధింపు ధోరణిని విడనాడి, జర్నలిస్టులను వేధించే చర్యలకు స్వస్తి పలకాలని, సంబంధిత వ్యక్తి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు నిరసనగా గౌతమినగర్‌ కాలనీ గేట్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేపట్టారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే జర్నలిస్టుల బాధ్యతని, తమ వృత్తికి రాజకీయ రంగు పులమడం తగదని స్పష్టం చేశారు.

అనంతరం తహసీల్దార్‌ సూర్యప్రకాష్‌కు, మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేసి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) పినపాక నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పిండిగ వెంకట్‌, బర్ల జోషి, ఉపాధ్యక్షుడు రెడ్డి మహేష్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు తోట అశోక్‌ కుమార్ ,నాగేశ్వరరావు, ఓం ప్రకాష్‌, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వెలమ రాజేందర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రమణమూర్తి, జిల్లా సహాయ కార్యదర్శి సాయి సంపత్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బెల్లంకొండ పుష్పగిరి తదితర జర్నలిస్టు సంఘాల నాయకులు, మండల విలేకరులు పాల్గొన్నారు.