రైస్ మిల్ యజమాని ‘వొజ్జల’ అరెస్ట్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కౌటాల మండలంలోని శ్రీ వెంక టేశ్వర రైస్ మిల్ యజమాని వొజ్జల వెంకటేశ్వర్ ను ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసులో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం వొజ్జల వెంకటేశ్వర్ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ తో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం చేసుకుని రబీ 2022 రబీ 2023 సీజ న్లకు సంబంధించిన ప్రభుత్వ వడ్లను మిల్లింగ్ చేసి బియ్యంగా ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. సుమారు 1353 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వకుండా దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫైన్, వడ్డీతో కలిపి మొత్తం సుమారు 1693 మెట్రిక్ టన్నుల వడ్లు లేదా దాదాపు రూ.6.27 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా అక్రమంగా విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ బియ్యాన్ని కరీంనగర్ ప్రాంతంలోని లిక్కర్ ఫ్యాక్టరీలు , ఫీడ్ కంపెనీలకు విక్రయించినట్లు పోలీసు విచారణలో తేలింది. సివిల్ సప్లయ్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.




