ఐదు ట్రాన్స్‌ఫార్మర్లలో చోరీ.. రైతుల ఆందోళన
భిక్కనూర్: భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో, గుర్జకుంట గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ పొలాల్లో ఉన్న ఐదు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్, కాపర్ కాయిల్‌ను అపహరించారు. ఈ ఘటనతో ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు సకాలంలో నీరు అందక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇలాంటి చోరీలు తరచూ జరుగుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే ధ్వంసమైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. కొన్నిరోజుల క్రితం బస్వాపూర్ గ్రామంలో కూడా ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్, కాపర్ కాయిల్‌ను దొంగిలించిన విషయం తెల్సిందే.






