calender_icon.png 25 May, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారం సమీపంలో రోడ్డు ప్రమాదం..

25-05-2025 06:53:34 PM

హైదరాబాద్ కు చెందిన మహిళ మృతి..

సహాయక చర్యల్లో పోలీసులు, కాంగ్రెస్ నాయకులు..

కాటారం (విజయక్రాంతి): కాటారం-నస్తూరుపల్లి గ్రామాల మధ్య నేషనల్ హైవే 353 సి అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొట్టుకున్నాయి. కాలేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల(Saraswati Pushkaralu)కు వెళ్తున్న హైదరాబాద్ కు చెందిన భక్తుల కారు, పుష్కరాలకు వెళ్లి వస్తున్న వరంగల్ పట్టణానికి చెందిన కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. హైదరాబాదు నుండి  ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న రెడ్ కలర్ సెవెన్ సీటర్ కారు, వరంగల్ చెందిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన కారు అతివేగంతో ఢీకొనడంతో హైదరాబాద్ కు చెందిన  లలిత(55) అనే మహిళ మృతి చెందింది.

డ్రైవర్ మహేందర్ క్యాబిన్ లో ఇరుక్కోగా దుర్గాజికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కాటారం పోలీసులు సహాయక చర్యలో పాల్గొని  క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. వరంగల్ కు చెందిన మారుతి సుజుకి  కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న భక్తులు సురక్షితంగా ఉన్నారు. 108 అంబులెన్సు ద్వారా లలిత, దుర్గాజీలను  భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి  తరలించారు.

పరిస్థితి విషమంగా ఉన్న లలిత వంద పడకల ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు, దుర్గాజీ, డ్రైవర్ మహేంద్ర లను వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు వంద పడకల ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన కారు డ్రైవర్ మహేందర్ క్యాబిన్ లో ఇరుక్కోవడంతో జెసిబి ద్వారా కాంగ్రెస్ నాయకులు బయటకు తీయించారు. అనంతరం కాటారం ఎస్సై అభినవ్ తన వాహనంలో ఎక్కించుకొని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం వంద పడకల హాస్పిటల్ నుండి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

సహాయక చర్యల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, పోలీసులు..

పుష్కర భక్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, కాటారం పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులకు కాంగ్రెస్ నాయకులు సాయాన్ని అందించారు. కాటారం ఎస్సై అభినవ్, పోలీస్ సిబ్బంది, కాటారం మాజీ ఎంపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు చీమల సందీప్, మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, ఆత్మకూరి కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.