6 July, 2026 | 2:22 AM

మూడేళ్లయినా.. ముందుకురాని రోడ్డు

06-07-2026 01:13 AM

రోడ్డు నిర్మాణానికి రూ. కోటి మంజూరు

శంకుస్థాపన చేశారు.. వదిలేసారు

తాడ్వాయి, జూలై 5 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యాలు కల్పించి వారి ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పల్లె గడ్డ తండా బీటి రోడ్డు నిర్మాణానికి ఒక కోటి రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే సురేందర్ రోడ్డు నిర్మాణానికి 3-10- 2023న శంకుస్థాపన నిర్వహించారు. ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు.

దీంతో తండావాసులు మురిసిపోయారు. కానీ ఆ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ శంకుస్థాపనకే పరిమితమైంది. పల్లె గడ్డ తండా రోడ్డు  అద్వానంగా ఉండడంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు అవస్థలు పడుతున్నారు. రోడ్డు కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారడంతో రోడ్డుపై నడవాలంటేనే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

మూడేళ్లయిన.. ముందుకు రాని రోడ్డు..

పల్లె గడ్డ తండాకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం మూడేళ్ల కిందట శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులు ఎస్టీ ఎస్ డి ఎఫ్ నుంచి మంజూరయ్యాయని వివరించారు.కానీ ఇప్పటికీ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. శంకుస్థాపన చేయగానే తండావాసులు ఆనందపడ్డారు.

తమ తండాకు మెరుగైన రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది బీటీ రోడ్డు నిర్మాణం జరిగితే ఈ రోడ్డుపై సుఖంగా ప్రయాణం చేయవచ్చని అనుకున్నారు. కానీ వారి ఆనందం అంతలోనే ముగిసిపోయింది. మూడేళ్లు అవుతున్న ఇప్పటికీ రోడ్డుకు మోక్షం లేదు.దీంతో తండా వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

నిధులు లేకుండానే శంకుస్థాపన చేశారా..

అప్పటి ఎమ్మెల్యే సురేందర్ పల్లె గడ్డ తండా రోడ్డు నిర్మాణానికి నిధులు లేకుండానే శంకుస్థాపన చేశారా.. మమ్మల్ని మురిపించడానికే నిధులు మంజూరయ్యాయని తెలిపారా.. అని తండావాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఉండి ఉంటే వెంటనే రోడ్డు పనులు జరిగేవి కదా, ఎందుకు మధ్యలో రోడ్డు పనులు ప్రా రంభం కాలేదు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి తండావాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.

బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి 

పల్లె గడ్డ తండా బీటీ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు నిధులు మంజూరు చేయాలి. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి రూ.కోటి మంజూరు అయ్యాయని తెలిపారు. శిలాఫలకం సైతం వేశారు.కానీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

రూప్ సింగ్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు