6 July, 2026 | 2:52 AM

మామిడి మొక్కలకు కేరాఫ్ లోక్యతండా

06-07-2026 01:07 AM
  1. మామిడి మొక్కల పెంచుతున్న వందలమంది రైతులు మూస పంటలకు చెక్.. 
  2. ప్రత్యామ్నాయ పంటగా రైతులకు ఆర్ధిక మేలు
  3. మండలంలో లంబాడీ బిడ్డల సిరుల వ్యాపారం
  4. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని వేడుకుంటున్న రైతులు

ఖమ్మం, కూసుమంచి, జూలై 5(విజయక్రాంతి): ఏళ్ళ తరబడి ఒకే రకమైన పంటల సాగు.. మూస పద్దతిలో వ్యవసాయం. గత ముప్పు ఏళ్ళుగా ఒకే రకమైన సంప్రదాయ వ్యవసాయానికి అలవాటు పడిన రైతులు, మూస పద్దతిలో పంటలను సాగు చేస్తున్నారు. వరి ,పత్తి , మిర్చి పంటల సాగువైపే ఎక్కువ మంది మొగ్గుచూస్తున్నారు. దీంతో వాతావరణ పరిస్థితులు ,నాణ్యమైన విత్తనాలు దొరక్కా చివరికి పంట చేతికొచ్చిన పెట్టుబడి కూడా వెనక్కి రాకా అప్పుల ఊబిలోకి వెళ్తున్నారు.. 

పంట మార్పిడి చేయాలని అధికారులు ప్రభుత్వాలు మొత్తుకుంటున్న రైతులు పట్టించుకోవడం లేదు...  ఫలితంగా ప్రతి ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ  కూసుమంచి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజనులు వ్యవసాయ సాగులో నూతన విధానాలను, పద్దతులను అలవర్చుకున్నారు. వందలాది మంది లంబాడీ రైతులు మామిడి మొక్కల పెంపకం వ్యాపారంగా మార్చుకున్నారు.. మంచి ఫలితాలు సాధిస్తూ లాభాలు కూడా ఆర్జిస్తున్నారు.

మామిడి మొక్కుల పెంపకానికి కేరాఫ్ లోక్యతండా

కూసుమంచి మండలంలోని లోక్యతండా గ్రామానికి చెందిన వందలాది మంది లంబాడీ రైతులు సంప్రదాయ పద్దతి పంటలకు పుల్ స్టాప్ పెడుతున్నారు. రైతులను నట్టేట ముంచేస్తున్న వాణిజ్య పంటలను వదిలేసి నూతన పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మామిడి మొక్కలను పెంచుతూ వ్యాపారం చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా వందమందికి పైగా రైతులు మామిడి మొక్కల పెంపు సాగుపై దృష్టిపెట్టారు.  తమకున్న కొద్ది పాటి  భూమిలో మామిడి మొక్కలను పెంచుతున్నారు. ఎకరం భూమిలో దాదాపు 2 లక్షల మామిడి మొక్కల చొప్పున పెంచుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.  తండా మొత్తం మీద సుమారు 2కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు రైతులు చెబుతున్నారు.

మామిడి మొక్కల పెంపకం విధానం

ఈ మామిడి మొక్కల పెంపకంలో తొలి ప్రాధాన్యత మామిడి పిక్కలను ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి, మూడు రోజుల పాటు నీటితో తడుపుతూ నానబెడతారు. ఆ తర్వాత ఆ పిక్కలను బాగా శుభ్రం చేసి ఉదయం, సాయంత్రం వేళలో నీరు పెడుతూ, పిలకలు వచ్చిన పిక్కలను ఒక బ్యాగ్ లో మంచి సారవంతమైన మట్టితో నింపి ఉంచుతారు. ఈ దశలో 3 నుండి మూడున్నర నెలల్లో మొక్క మూడు నుండి నాలుగు అడుగుల ఎత్తుకు ఎదగగానే అంటూ కట్టడం మొదలు పెడతారు.

ఇక్కడ రైతుకు ఒక్క మొక్కను పెంచడం కోసం రూ.15 నుంచి రూ.25 వరకు  వరకు ఖర్చు వస్తుంది. పెరిగిన మొక్కలను 28 రూపాయల వరకు విక్రయించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఈ మామిడి మొక్కలను కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.. 

వందలాది మామిడి రకాలు..

లోక్యతండాలో వందలాది మంది రైతులు సుమారు 100కు పైగా రకాల మామిడి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కల పెంపకంలో కష్టంతో పాటు మంచి లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.. 25 ఏళ్ళుగా మామిడి మొక్కల పెంపకం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ధికంగా బలంగా నిలబడడానికి మామిడి మొక్కల పెంపకం వ్యాపారంగా మార్చుకున్నామని,  ప్రభుత్వాలు కూడా తమను ప్రోత్సహిస్తూ సబ్సిడీలు అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మార్కెట్ చేయడానికి అవకాశాలు సృష్టించాలని కోరుతున్నారు.

మామిడి మొక్కల రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి

గతంలో అందరి రైతుల లాగే వరి,పత్తి, మిర్చి వంటి పంటలు సాగు చేశాను. ఆ పంటలు నన్ను అప్పుల పాలు చేశాయి. అందుకే కొత్తగా ఆలోచించి  మామిడి మొక్కల పెంపకం గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు మామిడి మొక్కల పెంపకం వ్యాపారంగా మార్చుకున్నాను. ఎకరం భూమిలో 2లక్షల మొక్కలు పెంచుతున్నాను. ప్రతి ఏడాది రూ. రూ.40లక్షల ఖర్చు వస్తుంది. పంట మంచిగా ఉండి, గిరాకీ ఉంటే కచ్చితంగా ప్రతి ఏడాది 5లక్షల వరకు సంపాదించవచ్చు. కానీ ప్రభుత్వం సహాయం లేదు. ప్రభుత్వం మొక్కలకు సబ్సిడీ లేదా రుణాలు మంజూరు చేయాలి. అవసరం అయితే మొక్కలను స్వంతంగా కొనుగోలు చేయాలి. తద్వారా రైతులు లాభం పొందుతారు.

- తేజావత్ శ్రీనివాస్, మామిడి మొక్కల పెంపు రైతు, లోక్యతండా