25 April, 2026 | 6:32 PM

గురుకులాల ప్రగతిలో గురువుల పాత్ర అమోఘం

25-04-2026 05:24 PM

◆ క్రమశిక్షణే ఆభరణం - విజయమే గమ్యం

◆ స్వేరో జిల్లా అధ్యక్షులు తగరం శ్రీకాంత్ స్వేరో

◆ గురుకుల విద్యార్థులకు స్వేరో నెట్వర్క్ ఘన వీడ్కోలు

◆ సెలవుల్లోనూ ‘లక్ష్యం’ వీడొద్దు 

ఖమ్మం,(విజయక్రాంతి):గురుకులాల ప్రగతిలో గురువుల పాత్ర అమోఘం అని, ఖమ్మం జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యా సంవత్సరాన్ని అత్యంత క్రమశిక్షణతో, ఉత్తమ ఫలితాలతో పూర్తి చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు స్వేరో జిల్లా అధ్యక్షులు తగరం శ్రీకాంత్ స్వేరో శనివారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తగరం శ్రీకాంత్ స్వేరో మాట్లాడుతూ.. విద్యార్థులను కేవలం పాఠాలకే పరిమితం చేయకుండా, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్న జోనల్ ఆఫీసర్ అలివేలు, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు, అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయ బృందానికి, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో వారు చూపిస్తున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.

​సెలవుల్లోనూ ‘లక్ష్యం’ వీడొద్దు :

​వేసవి సెలవుల కోసం ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని స్వేరో నెట్వర్క్ ఆకాంక్షిస్తుందన్నారు. సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేసేలా సముచిత మార్గదర్శకత్వం అందించాలని కోరారు. కొత్త లక్ష్యాలతో, రెట్టింపు ఉత్సాహంతో తదుపరి విద్యా సంవత్సరానికి సిద్ధం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ​ఈ సందర్భంగా స్వేరో జిల్లా కమిటీ తరుపున విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.